28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

వాయిదాలకే పరిమితమవుతున్న విచారణ

Must read

📰 Generate e-Paper Clip

. మహిళా కమిషన్ ఆదేశాలు బేఖాతర్
. బీడీ యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గుతున్న అధికారులు
. కార్మిక శాఖపై అనుమానాలు
నిజామాబాద్, బతుకమ్మ: బీడీ యాజమాన్యాల చేతిలో నష్టపోయాను .. న్యాయం చేయండని కార్మిక శాఖకు వెళ్లి ఓ బాధితుడు, కార్మికులు మొర పెట్టుకోగా అధికారులు పెడచెవిన పెట్టారు. లాభం లేదనుకొని కలెక్టర్ కు విన్నవించినా జిల్లాస్థాయి అధికార యంత్రాంగం కదలలేదు. ఇలా కాదని రాష్ట మహిళా కమిషన్ కు పూర్తి వివరాలతో లేఖ రాయడంతో క్షుణ్ణంగా పరిశీలించిన కమిషన్ స్పందించింది. దీనిపై పూర్తి విచారణను నివేదిక రూపంలో పంపించాలని జిల్లా కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల 4వ తేదీన విచారణ కోసం కార్యాలయంలో హాజరు కావాలని ఫిర్యాదుదారునికి, బీడీ యాజమాన్యానికి ఆగమేఘాల మీద సందేశాలను పంపించారు. ఒత్తిళ్లు ఏమోచ్చాయో తెలియదు గాని, విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసి వెనువెంటనే మళ్లీ పొడిగించారు. ఇలా చేస్తూ పోతే బాధితునికి, కార్మికులకు న్యాయం జరుగుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యాలకు ఉపయుక్తంగా ఉండేందు కోసం కార్మిక శాఖాధికారులు కావాలనే వాయిదాలను పొడిగించుకుంటూ వెళ్తున్నారనే వాదనను ఫిర్యాదుదారునితోపాటుకార్మికులు వినిపిస్తున్నారు.

బీడీ కార్ఖానా పెట్టుకొని జీవిస్తున్న ఓ సాధారణ వ్యక్తి కార్మికులకు వేతనాలు, ఆకు, తంబాకు విషయంలో కంపెనీని ప్రశ్నించగా అతడిని ఏజెంగా కంపెనీ తొలగించింది. అయితే తాను రెండు బ్రాంచ్ ల కోసం చెల్లించిన డిపాజిట్ డబ్బులను తిరిగి ఇవ్వాలని అడిగితే కంపెనీ ఎదురు బెదిరింపులకు దిగింది. దీంతో బాధితుడితోపాటు కార్మికులు కంపెనీపై ఫిర్యాదులు చేశారు.

యాజమాన్యాల మెప్పు కోసం..
పేరుగాంచిన బీడీ యాజమాన్యం కారణంగా నష్టపోయిన బాదితుడు సంస్థ చేస్తున్న దోపిడీ తీరుతెన్నులను జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం రూపంలో అందించి, మహిళా కమిషన్ కు లేఖను సంధించాడు. బాధితులకు న్యాయం చేయడం కోసం ఉన్న కమిషన్ స్పందించడంతో చేసేది లేక కార్మిక శాఖ తేరుకొంది.

విచారణ చేపట్టి నివేదికను పంపిస్తే యాజమాన్యాలపై చర్యలు ఉంటాయని గ్రహించిన అధికారులు బాధితునికి, కార్మికులకు అన్యాయం చేసేందుకే ప్లాన్ చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్ల తరబడిగా కార్మికులను యాజమాన్యాలు ఏదో తరహాలో దోపిడీ చేస్తూనే ఉన్నాయి. గత నెలలో వెళ్ళిన ఫిర్యాదు కారణంగా మహిళా కమిషన్ ఆదేశాల మేరకు విచారణ పక్కాగా సాగుతుందని, తమకు కొంతలో కొంత మేలు జరుగుతుందని బీడీ కార్మికులు ఆశించారు. అయితే వారి ఆశలు అడియాసలే అయ్యే పరిస్థితి ఏర్పడింది.

వేళ్ల మీద లెక్కించే సంఖ్యలో ఉన్న యాజమాన్యాల మెప్పు కోసం వేలాది మంది కార్మికులకు అన్యాయం చేయాలనుకోవడం బాధాకరమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విచారణను తరచుగా వాయిదా వేయకుండ త్వరితగతిన పూర్తి చేసి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు.

More articles

Latest article