. కాంగ్రెస్ పై చౌకబారు విమర్శలు మానుకోవాలి
. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ: బీఆర్ఎస్ గుండాలను రక్షించి పోలీసులను ట్రాన్స్ ఫర్ చేయించిన చరిత్ర బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిది అని, మరోసారి ఘర్షణ వాతావరణం సృష్టిస్తే ఆయన బయట తిరగకుండా అడ్డుకుంటామని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి హెచ్చరించారు. జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు భీమ్ గల్ మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా ప్రశాంత్ రెడ్డి లేనిపోని రాద్ధాంతం చేసిన రాజకీయ కుట్రను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేస్తున్న అభివృద్ధి పనులు,అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రశాంత్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చి తీరుతామని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం పేరుతో మోసం చేసిందని విమర్శించారు.
పోలీసులు లాఠీచార్జి చేశారని ప్రశాంత్ రెడ్డి ఆరోపిస్తున్నారని, గతంలో భీమ్ గల్ కేంద్రంగా యువకులు తమ బాధలు చెప్పుకోవడానికి వస్తే బూటు కాలుతో తన్నిన చరిత్ర ప్రశాంత్ రెడ్డిదని మోహన్ రెడ్డి విమర్శించారు. మరోసారి ఇటువంటి పరిస్థితి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
