29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

హత్య కేసులో ఐదుగురి అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : కారు డబ్బుల  విషయంలో ఒకరిని హత్య చేసిన కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి ఏఏస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల  సమావేశం నిర్వహించి వివరాలను  వెల్లడించారు. దోమకొండ  మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన ఈరవేని రమేష్ తన భార్య పేరున ఉన్న  మారుతి స్విఫ్ట్ కారును చింతామన్ పల్లి గ్రామానికి చెందిన పల్లె పోచయ్య గత సంవత్సరం డిసెంబర్ నెలలో రూ.3.85లక్షలకు కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి ఒకసారి 26,300, ఈఎంఐ 13150 రూపాయల చొప్పున మొత్తం 65750 రూపాయలు పోచయ్య చెల్లించాడు. తర్వాత రూ.1.36లక్షలు రమేష్ కు నగదు రూపంలో ఇచ్చాడు. మిగతా డబ్బులు ఇవ్వాలని పోచయ్యను అడుగగా.. మొత్తం ఫైనాన్స్  క్లియర్ చేసి మిగతా డబ్బులు ఇస్తానని రమేష్ తో గొడవ పెట్టకున్నారు. ఈనెల 25న రమేష్ తన భార్య అనిత, పోచయ్య ముగ్గురు కలిసి ఫైనాన్స్ క్లియర్ చేసేందుకు కామారెడ్డి మహీంద్రా ఫైనాన్స్ కు వెళ్లారు. మొత్తం లక్షా 85వేలు చెల్లిస్తే ఫైనాన్స్ క్లియర్ అవుతుందని చెప్పడంతో పోచయ్య  దానికి ఒప్పుకుని నాలుగైదు రోజుల్లో క్లియర్ చేస్తానని ఒప్పుకున్నాడు. మళ్లీ 26న పోచయ్య వద్దకు వెళ్లి డబ్బులు తనకే ఇవ్వాలని రమేష్ గొడవపడి వెళ్లిపోయాడు. గురువారం చింతామన్ పల్లి శివారులో గల ఇటుక బట్టీ వద్ద కారును నిలిపి  బట్టి వద్ద ఉన్న  గదిలో పోచయ్య ఫోన్ చూస్తూ ఉండగా తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో కారు  ఓపెన్ అయిన శబ్ధం విని పోచయ్య బయటకు వచ్చి చూడగా రమేష్ కారును తీసుకుని వెళ్తున్నాడు. వెంటనే కారును ఆపిన పోచయ్య కారులో ఉన్న రమేష్ ను బయటకు లాగి కాలర్ పట్టుకోగా బట్టీలో పనిచేస్తున్న ఒడిస్సాకు చెందిన కూలీలు వచ్చి విడిపించారు. వెంటనే పోచయ్య పక్కనే ఉన్న కర్ర తీసుకుని రమేష్ తలపై బలంగా కొట్టడంతో పడిపోయిన రమేష్ ను ఎలాగైనా చంపాలన్న ఉద్దేశ్యంతో రమేష్ కాళ్లు, చేతులు కట్టేసి పోచయ్య తన అల్లుడు, కూలీలతో కలిసి చచ్చేదాకా తీవ్రంగా కొట్టారు. తమకు ఏమీ తెలియనట్టు రమేష్ కులస్తుడు రాములుకు ఫోన్ చేసి రమేష్ ఇక్కడ పడి ఉన్నాడని చెప్పి వెంటనే 100కు కాల్ చేసి గొడవ జరుగుతుందనని చెప్పి అక్కడి నుంచి పారి పోయారు. పోలీసులు, రమేష్ భార్య వచ్చి రమేష్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలో చని పోయాడని తెలిపారు. రమేష్ ను హత్య చేసిన పోచయ్య అతని అల్లుడు హరీష్, ఇటుక బట్టీ కార్మికులు రాజ్ కుమార్, రమేష్, బిదేశీ నాయక్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో భిక్కనూర్ సీఐ సంపత్, దోమకొండ ఎస్సై స్రవంతి పాల్గొన్నారు.

More articles

Latest article