- పోలీసు శాఖ నుంచి రెవెన్యూ శాఖకు
- మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇలాఖలో కలకలం
- ఇసుక వ్యాపారి వీడియోలు, ఆడియోల వైరల్
- తహసీల్ధార్ మొదలుకుని ఆర్ఐ వరకు మామూళ్ళ ఆరోపణలు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా సరిహద్దులోని బోధన్ నియోజకవర్గంలో ఇసుక తుఫాన్ చెలరేగింది. ఇసుక రీచ్ లకు అనుమతులు లేకపోయినా, ప్రభుత్వ అవసరాలకు, ప్రజల కోసం అనుమతులు ఇచ్చిన చోట అక్రమాలకు తెర తీశారు అధికార యంత్రాంగం. ఇది వరకే బోధన్ సబ్ డివిజన్ లో ఇసుక తుఫాన్ తో పోలీసు శాఖ అతలాకుతలమైంది. కొన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సైలు తమ ప్రాంతంలో జరిగే ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా విషయంలో ఇసుక వ్యాపారుల నుంచి తీసుకుంటున్నా, తీసుకున్నా మామూళ్ళ వ్యవహరం రాష్ట్ర ఇంటెలిజెన్స్ ను తాకిన విషయం విధితమే. ఈ విషయంలో జిల్లాలోనే అత్యధిక ఇసుక అక్రమ రవాణా వసూళ్ళపై పోలీసు శాఖ అనుబంధ ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన నివేదికనే అందుకు ఉదాహరణగా చెప్పాలి. ప్రస్తుతం పోలీసు శాఖ నుంచి సంబంధిత ఇసుక మామూళ్ళ వ్యవహరం రెవెన్యూ శాఖకు మళ్లినట్లయింది. గతేడాది అక్టోబర్ 9న ఇంటెలిజెన్స్ నివేదికలో ఇద్దరు సిఐలు, 12 మంది ఎస్సైల వ్యవహరంలో బోధన్ డివిజనే ప్రముఖంగా కనిపించింది. బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ ల ఎస్సైలు, సర్కిల్ ఇన్స్ పెక్టర్లు, లక్షల్లో మామూళ్ళు తీసుకుని పోస్టింగ్ లను పొగొట్టుకున్నారు. అయినా మార్పు రాలేదు. బోధన్ ప్రాంతంలోని మంజిరా, గోదావరి, హరిద్రా నదుల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతునే ఉంది. కొత్త పోలీస్ కమిషనర్ వచ్చిన తర్వాత పోలీసు శాఖ హడావుడి కేసుల వ్యవహరం మొదలయింది.
బోధన్ ఇలాఖ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అడ్డా. ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉమ్మడి జిల్లాకు పెద్దగా వ్యవహరిస్తున్న సుదర్శన్ రెడ్డి ఇలాఖలో ఇసుక తుఫాన్ కలకలం రేపుతుంది. మొన్నటి వరకు పోలసు శాఖను టార్గెట్ చేసిన ఇసుక మాఫియా ఇప్పుడు రెవెన్యూ శాఖ పై పడినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం బోధన్ రూరల్ మండలం కొప్పర్గ గ్రామానికి చెందిన సయ్యద్ అజిజ్ అనే ఇసుక వ్యాపారి తన టిప్పర్ ను రెవెన్యూ శాఖ సీజ్ చేసిన అనంతరం రెవెన్యూ శాఖలోని అధికారులతో జరిపిన మాటమంతి, లావాదేవిల వ్యవహరాన్ని బట్టబయలు చేశాడు. రెవెన్యూ అధికారులు ఒక్కొక్క టిప్పర్ కు రూ.50 వేలు వసూల్ చేశారని ఆరోపించారు. రెవెన్యూ ఇన్స్ పెక్టర్ గంగాధర్ తమ వద్ద డబ్బులు అడిగినా, తీసుకున్నావి సంబంధించిన ఆడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
బోధన్ సబ్ డివిజన్ నుంచి నిత్యం ఇసుక అక్రమంగా మహారాష్ట్రతో పాటు నిర్మల్, నిజామాబాద్ కు తరలివస్తుంది. స్థానికంగా అవసరాల కోసం అనుమతులు ఇచ్చామని రెవెన్యూ అధికారులు సర్టిఫై చేయగా సంబంధిత ఇసుక మాత్రం బోధన్ ను దాటి సరిహద్దులను దాటిపోతుంది. పోలీసుల అండదండలతో ఇసుక మాఫియా చెలరేగిపోగా వారికి రెవెన్యూ అధికారులు తోడయ్యారనడానికి ఇసుక వ్యాపారితో రెవెన్యూ అధికారుల లావాదేవిలు, కార్యకలాపాలే సాక్ష్యమని చెప్పవచ్చు. ఇసుక రవాణా కోసం అధికారులు వ్యాపారులతో లాలూచి పడి అనుమతులు ఇవ్వడం, గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోరన్న వాదనలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇసుక టిప్పర్లు దొరికినా, ట్రాక్టర్లు దొరికినా కేసులు ఉండవని జరిమానాతో వదిలేశారనే ఆరోపణలు కొకొల్లాలు. రాత్రేవేళ ఇసుక రవాణా జరిగితే తమ వద్ద సిబ్బందిలేరని, రక్షణ లేరనే సాకుతో రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమ రవాణాను పట్టించుకోరనే ఆరోపణలున్నాయి. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇలాఖలో రెవెన్యూ అధికారులు కాసులకు ఆశపడి సహజవనరులను దోపిడిదారులకు అప్పగిస్తున్న ఘటనపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికైనా స్పందిస్తుందా లేదా అనేది తేలనుంది.
- రెవెన్యూ సిబ్బందిపై కావాలనే అభండాలు
- బోధన్ తహసీల్దార్ విఠల్
అజీజ్ అనే వ్యక్తి కావాలనే రెవెన్యూ సిబ్బందిపై అభండాలు మోపుతున్నారు. టీఎస్ 16యూబి 9892 టిప్పర్ ను ఈ నెల 10న హనీస్ నగర్ లోని ఒక కంపౌడ్ వాల్ లో అక్రమంగా ఇసుక డంప్ చేసి నింపుతుండగా మాకు వచ్చిన సమాచారం ప్రకారం రెవెన్యూ సిబ్బందితో కలిసి పట్టుకున్నాం. టిప్పర్ ఓనర్ అయిన అజీజ్ వద్ద ఉన్న వే బిల్ ను పరిశీలించగా 10 మార్చి 2025 అని రాసి ఉంది. ఈ వే బిల్ గురించి సాలూరా తహసీల్దార్ ను లేఖ ద్వారా కోరాం. తాము 1 మార్చి 2025న ఆ వే బిల్ ను ఇచ్చామని తెలిపారు. 13 మార్చిన తాము ఎలాంటి వే బిల్ ఇవ్వలేదని తెలిపారు. దీంతో టిప్పర్, టిప్పర్ యజమానికి అర్బన్ సీఐ పోలీస్ స్టేషన్ లో అప్పగించాం. అజీజ్ అనవసరంగా రెవెన్యూ సిబ్బందిపై అభండాలు వేస్తున్నారు.
