దేవునిపల్లి, బతుకమ్మ : దేవుని పల్లి పోలీస్ స్టేషన్ పరధిలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. నర్సన్నపల్లి గ్రామానికి చెందిన రాసమొల్ల రాజశేఖర్(27) ఒక షోరూంలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య రమ్య, 16నెలల కూతరు ఉన్నారు. హోలీ పండుగ సందర్భంగా రాజశేఖర్ భార్య రమ్య తన తల్లిగారింటికి వెళ్లింది. శుక్రవారం సాయంత్రం తన భర్త రాజశేఖర్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ శనివారం ఉదయం కూడా ఫోన్ చేయగా అదే విధంగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చిన రమ్య తన భర్త స్నేహితుడైన పిట్ల నరేందర్ కు ఫోన్ చేసింది. దీంతో ఆయన చిన్నా మల్లారెడ్డి చెరువు వద్ద రాజశేఖర్ బైకు, చెప్పులు, బైక్ ప్యాకెట్ లో ఫోన్ ఉంది అని తెలిపాడు. దీంతో రమ్య తన కుటుంబ సభ్యులతో చిన్నామల్లారెడ్డి చెరువు వద్దకు చేరుకుని చూడగా తన భర్త మృతదేహం చెరువులో తేలుతూ కనిపించింది. తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
