- కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి
- మున్సిపల్ కార్యాలయాల్లో సహాయక కేంద్రాలు
- కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నెంబర్ 08462 – 220183
నిజామాబాద్, బతుకమ్మ : ప్లాట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి మార్చి 31వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకునే వారికి ప్రభుత్వం 25 శాతం రిబేటు సౌకర్యాన్ని వర్తింపజేస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. నాన్ లేఅవుట్ ప్లాట్లు కలిగి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి శుక్రవారం సాయంత్రం ఎల్.ఆర్.ఎస్ అంశంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. అనంతరం కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నాన్ లేఅవుట్ ప్లాట్ల క్రమబద్దీకరణకు రిబేటు సదుపాయం కల్పించినందున, ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ అర్హులైన వారు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. 2020 ఆగస్టు 26వ తేదీ లోపు దాఖలైన ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులకు మాత్రమే ఇదివరకు క్రమబద్దీకరణకు అవకాశం కల్పించగా, ప్రస్తుతం ఆ గడువును ప్రభుత్వం ఎత్తివేస్తూ కొత్తగా దరఖాస్తులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించిందని కలెక్టర్ తెలిపారు. ఎల్.ఆర్.ఎస్ కోసం దరఖాస్తులు చేసుకునే వారికి తగిన సమాచారం తెలియజేస్తూ, వారి సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. అదేవిధంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) లోనూ కంట్రోల్ రూమ్ నెంబర్ 08462 – 220183 కు కార్యాలయాల పని వేళల్లో సంప్రదించవచ్చని కలెక్టర్ సూచించారు. కాగా, పెండింగ్ లో ఉన్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్రంగా పరిశీలిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సర్వే నెంబర్లు, ప్లాట్ అప్లికేషన్ల సంఖ్య, రోడ్డు విస్తీర్ణం, ఇనాం భూమి, ఇరిగేషన్ ల్యాండ్ వంటి అంశాలను పక్కాగా పరిశీలన జరపాలన్నారు. రఖాస్తుదారులను అనవసర ఇబ్బందులకు గురిచేయకూడదని, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళడానికి ముందే దరఖాస్తుదారులకు సమాచారం అందిస్తే, వారు ప్లాట్ స్థలంలో అందుబాటులో ఉంటారని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా అది ప్రైవేట్ స్థలమేనా లేక ప్రభుత్వ స్థలమా అన్నది అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా నిర్ధారించుకోవాలని అన్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను పాదదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో ప్రగతి కనిపించేలా అంకితభావంతో పని చేయాలని, వారం రోజుల అనంతరం మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

