. . . 27 బైక్ లు స్వాధీనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
హైదరాబాద్ లో షోరూంలకు చెందిన బైక్ లను గ్రామాల వారికి అమ్మేసి ఇన్సూరెన్స్ కంపెనీలను మోసం చేసిన పలువురిని అరెస్టు చేసినట్లు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆర్మూర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్ ప్రాంతంలోని ఆర్కెపురంలో గల హీరోపిన్ కార్ లిమిటెడ్ టర్సరీ సిల్స్ మేనేజర్ షేక్ అబ్దుల్ రఫి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో 9 మందిని నిందితులుగా గుర్తించామని అందులో కొందరినీ అరెస్టు చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. హైదరాబాద్ లోని రాజేంధ్రనగర్ మహ్మదీయకాలనీ చెందిన సయ్యద్ ఒమర్, రాజేంధ్రనగర్ లంగర్ గూడలోని శామకాలనీకి చెందిన షాజిద్ ఆలీ, చార్మినర్ బషారత్ నగర్ కు చెందిన షాబీర్ ఖాన్ అయాన్ ఆలియాజ్ షాబాజ్ ఖాన్, కామారెడ్డిలోని బర్కత్ పూరకు చెందిన మహ్మద్ యాసీన్, ఆర్మూర్ మండలం మిర్దాపల్లికి చెందిన కల్లేం యోగేష్ రెడ్డి, ఆర్మూర్ మండలం రాంపూర్ కు చెందిన బంటు ప్రశాంత్, ఆర్మూర్ మండలం అంకాపూర్ కు చెందిన కొమ్ముల వెంకట్ రెడ్డి, సిరికొండ మండలం హుస్సెన్ నగర్ కు చెందిన తినేటి నరేష్ రెడ్డి, ధర్పల్లి మండలం మైలారం గ్రామానికి చెందిన కాటిపల్లి శ్రీకాంత్ రెడ్డిలను నిందితులుగా గుర్తించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయగా ఐదుగురు పరారీలో ఉన్నారని ఏసీపీ తెలిపారు. ఈ కేసును చేదించడంలో ఆర్మూర్ ఎస్ హెచ్ వో సత్యనారాయణ, ఎస్సైలు ఇంధ్రకరణ్ రెడ్డి, గోవింద్, మహేష్ లను ఆయన అభినందించారు.
. . . కొండను తవ్వి ఎలుకను పట్టారా?
హైదరాబాద్ లో తీగలాగితే ఆర్మూర్ లో డొంక కదిలిన కేసులో పోలీసుల వ్యవహర శైలిపై దుమారం చెలరేగుతుంది. హైదరాబాద్ కు చెందిన షోరూంలలోని బైక్ లను ఇన్సూరెన్స్ చేయించి నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతంలో ప్రజలకు తక్కవ ధరకు అమ్మిన కేసు రాజకీయ రంగు పులుముకున్న విషయం తెల్సిందే. ప్రధానంగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను ముందుగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం విధితమే. ఆర్మూర్ కు చెందిన ప్రజాప్రతినిధి అనుచరులు ముఖ్యంగా బీజేపీ నాయకులే దీని వెనుక ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే అరెస్టు చేసిన వారి వివరాలను వెల్లడించేందుకు పోలీసు శాఖపై ఒత్తిడి వచ్చిందని విమర్శలున్నాయి. అంతేగాకుండా అరెస్టు చేసిన వారి వివరాలు వెల్లడించేందుకు తీసుకున్న సమయంతో పాటు విచారణలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తప్పించారని విమర్శలు కూడా చెలరేగాయి. ఈ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య సోషల్ మీడియాలోనే మాటల యుద్దం కొనసాగింది. తీరా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు తెలుపుకుండానే విలేకరుల సమావేశాన్ని మమ అనిపించారని వాదనలున్నాయి.
