బతుకమ్మ, పిట్లం : గ్రామాలలో సమస్యలు పరిష్కరించాలంటే నిధులు కావాలని, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలలో అభివృద్ధి చెందాలంటే నిధులు మంజూరు చేయాలని మంగళవారం పిట్లం మండల కార్యదర్శిలు ఎంపీడీవో కమలాకర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కార్యదర్శిల అధ్యక్షుడు వినోద్ మాట్లాడుతూ ప్రజా పాలన వ్యవస్థలో సర్పంచుల పాలన ఉన్నప్పుడు మాపై భారంపడేది కాదని, అధికారుల పాలన వ్యవస్థలో కార్యదర్శిలపై భారం ఎక్కువ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి నిధులు లేక ఇప్పటివరకు అప్పులు తెచ్చి పనులు చేయించామని అన్నారు. ఎనిమిది నెలల నుండి నిధులు లేక అవస్థలకు గురవుతామని అన్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శిలు అంబయ్య, సునీత, లక్ష్మణ్, కార్యదర్శిలు పాల్గొన్నారు.
