- 28 మంది ఏనుగు వర్గీయులపై వర్ని పిఎస్ లో కేసు నమోదు
- కేసు నమోదు వెనుక పోచారం ప్రమేయం ఉందని మంత్రి జూపల్లికి ఫిర్యాదు
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి ల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఏకంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ముఖ్య అనుచరులపైన వర్ని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులను ఆగ్రహానికి గురిచేసింది. పోలీస్ విధులకు ఆటంకం కలిగిస్తున్నారన్న ఫిర్యాదుపై 28 మందిపై కేసు నమోదు కాగా దీని వెనుక పోచారం ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి ఇటీవలే వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగడాలు మితిమీరిపోతున్నాయని, ప్రశ్నిస్తే తమపై అక్రమంగా కేసులు పెట్టించారని మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి సహనం పాటించాలని, కేసు నమోదు పై ఆరా తీస్తానని వారికి మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం. మంత్రి జూపల్లి కంటే ముందు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు సైతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోచారంపై ఫిర్యాదు చేశారు. పోచారం వ్యవహారం పార్టీ పెద్దల దృష్టికి రావడంతో ఇంచార్జీ మంత్రి సైతం ఈ విషయంలో సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకముందు జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్ని మండలంలోని గ్రామాలకు అభివృద్ధి పనుల నిమిత్తం 10 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దీంతో పనులు సాగుతున్న తరుణంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్‌ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే తన పలుకుబడిని ఉపయోగించి జిల్లా ఇంచార్జీ మంత్రి విడుదల చేసిన నిధులను నిలిపివేసినట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు పోచారంపై పార్టీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరుల పై కక్ష సాధింపులో భాగంగా పోచారం తమపై చర్యలకు దిగినట్లు పార్టీ నాయకులు విమర్శించారు. ఇందులో భాగంగానే తమపై వర్ని పిఎస్ లో ఈనెల 11వ తేదీన తప్పుడు కేసు నమోదు చేయించారని ఏనుగు వర్గీయులు జిల్లా ఇంచార్జ్ మంత్రికి ఫిర్యాదు చేశారు. మొదటి నుండి పార్టీలో కొనసాగుతున్న తమపై నిన్న మొన్న పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి తప్పుడు కేసు నమోదు చేయించడం అధికార పార్టీలో రచ్చకు దారితీసింది. దీనిపై ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు సీరియస్ గా ఉన్నారు.
