- తొమ్మిదిన్నర తులాల బంగారు ఆభరణాలు రికవరీ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న యువకుడిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్ తెలిపారు. సౌత్ రూరల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 7న ఆటోనగర్ లోని ట్రిమ్స్ లో లెక్చరర్ గా పని చేసే ఇలియాస్ ఇంట్లో ఆటోనగర్ కు చెందిన అప్తాబ్ షేక్ అన్వర్ చోరికి పాల్పడ్డాడని సిఐ తెలిపారు. ఆనాటి నుంచి దొంగల కోసం గాలిస్తున్నామని తెలిపారు. బుధవారం ఉదయం అర్సపల్లిలోని నాలెడ్జ్ పార్క్ స్కూల్ వద్ద 6వ టౌన్ ఎస్సై వెంకట్రావ్ వాహనాలు తనిఖీ చేపట్టారని తెలిపారు. ఓ యువకుడు అనుమానాస్పదంగా నంబర్ ప్లేట్ లేని స్కూటిపై వస్తుండగా అతన్ని పట్టుకుని విచారించగా అతని ఢిక్కీ ఓపెన్ చేసి చూస్తే అందులో 9 తులాల బంగారు ఆభరణాలు గుర్తించినట్లు తెలిపారు. అవి లెక్చరర్ ఇలియాస్ ఇంట్లో దొంగతనం చేసినవేనని విచారణలో తేలిందన్నారు. షేక్ అన్వర్ నుంచి తొమ్మిదిన్నర తు లాల బంగారు ఆభరణాలు, రెండు గడియారాలు, రెండు సెల్ ఫోన్, స్కూటితో పాటు రూ.15 వేల నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. అన్వర్ జల్సాలకు అలవాటుపడి తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతాడని సిఐ తెలిపారు. చోరి జరిగిన వారం రోజుల్లోనే కేసు చేదించిన 6వ టౌన్ ఎస్సై వెంకట్రావ్, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
