25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

అడుగంటిన భూగర్భ జలాలు

Must read

📰 Generate e-Paper Clip

  • అత్యధిక వర్షపాతం కురిసినా నీటి వినియోగం పెరిగింది
  • ఈ వేసవిలో నూతన బోరుబావులు తవ్వకపోవడమే మంచిది

నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటాయి. భూగర్భ జలశాఖ జనవరి మాసంలో 82 ఫీజో మీటర్ల ద్వారా సేకరించిన భూగర్భజలాలు సరాసరి నీటిమట్టం 10.9 మీటర్లుగా నమోదయింది. గడిచిన వర్షాకాలంలో నిజామాబాద్ జిల్లాలో 15 శాతం అధికంగా వర్షం కురిసిన వ్యవసాయం కొరకు ఎక్కువగా బోరుబావులపై ఆధారపడడమే భూగర్భజలాలు తగ్గడానికి కారణం. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ నీటి విడుదల జరుగుతున్న అలీసాగర్, గుత్ప, హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల పథకాలతో పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా బాల్కొండ నియోజకవర్గంలో సాగునీరు అందుతున్న బోరుబావుల వాడకం మాత్రం తగ్గడం లేదు.నిజామాబాద్ జిల్లాలో దాదాపు లక్షకు పైగా బోరుబావులు ఉన్నాయి. ప్రధానంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంతో పాటు బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్ పల్లి, భీంగల్, వేల్పూర్, మోర్తాడ్ ప్రాంతాల్లో వ్యవసాయానికి ఎక్కువగా బోరుబావులను వినియోగిస్తున్నారు. ప్రతియేటా కురిసిన వర్షంలో పది శాతం మాత్రమే భూమిలోకి ఇంకడం వల్ల భూగర్భ జలమట్టాలపై ప్రభావం చూపుతుంది. అయితే భూగర్భ జలాలను వ్యవసాయం, పరిశ్రమలు, తాగునీటి కొరకు వినియోగిస్తుండడంతో తగ్గిపోవడం ప్రధాన కారణమైంది. అంతేగాకుండా పట్టణం, నగరం విస్తరణ నేపథ్యంలో భూగర్భ జలాల వినియోగంకు తాగునీటికి అడ్డుఅదుపు లేకుండా బోర్ల తవ్వకాలు చేస్తున్నారు. సంవత్సరం పొడవునా పొదుపుగా వాడుకోవాల్సిన భూగర్భ జలాలను పరిమితికి మించి వినియోగిస్తుండడంతో కొత్తగా వేసే బోరులు ఫెయిల్ అవుతున్నాయి. అందులో ప్రధానంగా వ్యవసాయ క్షేత్రాలలోని బోరుబావులే ప్రధాన కారణం. వేసవిలో తాగునీటి అవసరాల కోసం కొత్తగా బోర్లువేసే సమయంలో భూగర్భ జలాలను అంచనా వేసుకోవాలని భూగర్భజల శాఖ సూచిస్తుంది. వ్యవసాయ బోరుబావులు తవ్వకపోవడమే ఉత్తమమని భూగర్భజలశాఖ ఉపసంచాలకులు శ్రీనివాసుబాబు తెలిపారు.

More articles

Latest article