బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండలంలోని వెంకంపల్లి గ్రామానికి చెందిన చిలుకూరి సురేందర్ రెడ్డి, మరో వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన ఆకిడి జమాకర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్ తెలిపారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం నాగిరెడ్డిపేట మండలంలోని వెంకంపల్లి గ్రామంలో పోలీస్ పటేల్, మాలిస్ పటేల్ వ్యవస్థ కొనసాగిన కాలంలో వెంకంపల్లి గ్రామ అభివృద్ధి కోసం గ్రామ మంజీరా నది శివారులోని పది ఎకరాల శిఖం భూమిని కేటాయించినట్లు, ఈ భూమిని కౌలు చేసిన వ్యక్తులు గ్రామ అభివృద్ధి కోసం డబ్బులు ఇవ్వాలని తీర్మానం చేసినట్లుగా గ్రామస్తులు తెలిపారన్నారు. ఈ గ్రామ అభివృద్ధి కోసం కేటాయించిన 10 ఎకరాల శిఖం భూమిని గ్రామానికి చెందిన ఆకిడి జమాకర్ రెడ్డి, కమాల్ రెడ్డి అనే వ్యక్తులు గత 7 సంవత్సరాలుగా పంటలు సాగు చేస్తూ కౌలుకు చేస్తున్నారని తెలిపారు. ఈ ఇద్దరు వ్యక్తులు పది ఎకరాల భూమిని కౌలుకు చేస్తూ గ్రామానికి నయా పైసా చెల్లించడం లేదని ప్రస్తుత రబీ సీజన్లో కూడా వరి నాట్లు వేయడంతో కొంత మంది గ్రామస్తులు సంక్రాంతి పండుగ రోజు ఆ పంటను పరిశీలించేందుకు వెళ్లగా కౌలు చేస్తున్న జమాకర్ రెడ్డి, కమాల్ రెడ్డి లు గ్రామస్తులపై తిరగబడి ఈ భూమి తమ సొంతం భూమి అంటూ గ్రామస్తులను బెదిరించారన్నారు. కౌలుకు చేస్తున్న గ్రామానికి చెందిన భూమి తమదెల అవుతుందని ప్రశ్నించిన చిలుకూరి సురేందర్ రెడ్డి మరో వ్యక్తిపై జమాకర్ రెడ్డి దాడి చేశారని గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జమాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సి ఐ రవీందర్ నాయక్ తెలిపారు.
