- 461 గ్రాముల గంజాయి, ఐదు సెల్ ఫోన్లు, కారు, రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్ లో గల ఒక ఇంటిపై దాడి చేసి శుక్రవారం ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ పట్టణ సీఐ శ్రీనివాస్ రాజ్ తెలిపారు. వినాయక్ నగర్ లోని ఒక ఇంటిలో గంజాయి అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు నాలుగో టౌన్ పోలీసులు దాడి చేసి నలుగురు వ్యక్తులు ఆకాష్, రోహిత్ కుమార్, శివరానా రామతేజ్ రెడ్డి, రాకేష్, ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వీరి వద్ద నుంచి 461 గ్రాముల గంజాయి, ఐదు సెల్ ఫోన్లు, రెండు మోటార్ సైకిళ్లు, ఒక కారు, గంజాయి ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించే 18 ఖాళీ ప్లాస్టిక్ కవర్ లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఎన్ఢీపీఎస్ ఆక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి శుక్రవారం ఐదుగురిని కోర్టులో హాజరు పరచి రిమాండ్ కు తరలించామని తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల సహకారంతో గంజాయిని నిర్మూలించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు తమ వంతు సహకారం అందించాలని, ఏమైనా సమాచారం ఉంటే తమకు తెలపాలని అన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. తల్లిదండ్రలు తమ పిల్లల కదలికలపై, కాలేజీ యాజమాన్యం తమ విద్యార్థుల కదలికలపై దృష్టి సారించాలని సూచించారు.
