- వీ.సీ ద్వారా అధికారులతో ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్
- ప్రారంభోత్సవ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించాలి
నిజామాబాద్ , బతుకమ్మ : ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాల్లో డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నందున జిల్లా వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని0 పండుగ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ సంక్షేమ శాఖల జిల్లా అధికారులు,ఆర్సిఓ లు,ఎంపీడీఓలు,తహశీల్దార్లతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సాయంత్రం బాల్కొండ తహశీల్దార్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెసిడెన్షియల్ గురుకులాలు,హాస్టల్ లలో 40 శాతం డైట్,200 శాతం కాస్మోటిక్ చార్జిల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపట్టి విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు,వసతి గృహాలలోని విద్యార్థిని విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులతో కలసి భోజనం చేస్తారని తెలిపారు. అందుకు అనుగుణంగా కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులతో పనులు చేయించకూడదని, ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి అధికారి ఇకనుండి వారంలో కనీసం ఒకటి,రెండు సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై సమీక్షిస్తూ ఈ నెలాఖరులోగా సర్వే ప్రక్రియ పూర్తయ్యేలా వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా వాస్తవ వివరాలను సేకరిస్తూ మొబైల్ యాప్ లో పొందుపరచాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ అంకిత్,అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్,ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్,జిల్లా ఎస్సీ,ఎస్టి,బీసీ,మైనార్టీ సంక్షేమ అధికారులు,తదితరులు పాల్గొన్నారు
