నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జర్నలిస్టుపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును అరెస్టు చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్, జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంతడ్పుల రామకృష్ణ మాట్లాడుతూ.. హైదరాబాద్ జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటి వద్ద న్యూస్ కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని, జర్నలిస్టులకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ప్రెస్ క్లబ్ కార్యదర్శి బైర శేఖర్, జర్నలిస్టులు పంచరెడ్డి శ్రీకాంత్, ధనుంజయ్, గోవిందరాజు, వెంకటేశ్, సతీశ్, రవిచరణ్ తదితరులు పాల్గొన్నారు.