కామారెడ్డి, బతుకమ్మ : హైదరాబాద్ కోకాపేటలో నిర్మించిన దొడ్డి కొమరయ్య కురుమల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి జిల్లాలోని కురుమలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు మర్కంటి భూమన్న కోరారు. సోమవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇల్చిపూరు శివారులో గల సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కురుమల సమాయత్తపు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కురుమలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఉన్న అన్ని స్థానాల్లో పోటీచేసి రాజకీయంగా ఎదగాలని సూచించారు. భవన ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు షబ్బీర్ అలీ సభకు తరలడానికి వాహనాలు సమకూర్చినట్లు తెలిపారు. కామారెడ్డి నుంచి 58, జుక్కల్ నుంచి 66, ఎల్లారెడ్డి నుంచి 65, బాన్సువాడ నుంచి 48 బస్సులు బయలు దేరుతున్నాయని పేర్కొన్నారు. అవసరమనుకుంటే మరిన్ని వాహనాలను కూడా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా వారికి కురుమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కురుమ సంఘం ప్రతినిధులు మర్కంటి బుచ్చన్న, బెల్లపు చంద్రం, ముత్యం, జోగుల గంగాధర్, గంగారం, దేవర లక్ష్మి, దొడ్లె మల్లేష్, జీవీఎం విఠల్ తో పాటు ఆయా మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.
