- ఓ సి బదిలీలు అపహాస్యం
- చర్యల మాటున రక్షణ
- డిపిఓ కార్యాలయం ఇష్టారాజ్యం
నిజామాబాద్, బతుకమ్మ : క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటే తప్పు ఎందుకు చేసాననే భావన వారిలో కలగాలి. సుతిమెత్తగా అమలు చేస్తే… వాటిని చర్యలు అనే బదులు పరిరక్షణ అని సంభోదిస్తుంటారు. అలాంటిదే జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఇటీవలే జరిగింది. నవీపేట మండల పరిషత్ లో ఉన్న ఈ -పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల మధ్య తరచుగా వివాదాలు నెలకొంటుడడంతో పాటు, విధులు సరిగా నిర్వహించడం లేదని ఫిర్యాదులు అందాయి. అక్కడున్న నలుగురిపై ఏకకాలంలో బదిలీ వేటు వేసి జిల్లా కేంద్రానికి చుట్టూ ఉన్న మండలాల్లోనే పోస్టింగ్ ఇచ్చారు. వీరిపై చర్యలు తీసుకుంటే జిల్లాకు సరిహద్ధులో ఉన్న మండలాలకు పంపించాలిగాని దగ్గర్లోనే ఉంచడం వెనుక మర్మమేంటోనని సిబ్బంది సంశయిస్తున్నారు.
బదిలీలు అపహాస్యం..
నవీపేట మండలంలో ఐదుగురు ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు ఉండగా, అందులో నుంచి ఒకరిని డిఎల్పిఓ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ఆపరేటర్ పనిభారం మిగతా నలుగురిపై పడింది. దీంతో తరచుగా వివాదాలు మొదలయ్యాయి. వీరిపై ఫిర్యాదులు రావడంతోపాటు ముఖ్యమైన పనులు సకాలంలో జరగడం లేదని గ్రహించిన అధికారులు అక్కడున్న నలుగురిని ఒకేసారి బదిలీ చేసారు. మాక్లూర్, డిచ్పల్లి, మోపాల్, రెంజల్ మండలాలకు సర్దుబాటు చేసి, ఆ మండలాల్లోంచి నవిపేటకు పంపించారు. ముందున్న మండలంలో పని చేసుకుంటున్నా వారిపై నవీపేట్ ఆపరేటర్ల వల్ల పరోక్షంగా వేటు పడినట్లయింది.
దూరం కాదు దగ్గరే..
చర్యలలో భాగంగా జిల్లా సరిహద్దుకు ఉన్న మండలాల్లోకి పంపిస్తే దూర రాకపోకల వెతలు తెలిసి వచ్చేవి. అలాగాకుండా నగరం పరిధిలో ఉన్న మండలాలకు సర్దుబాటు చేయడం వెనుక ఉద్దేశాలేంటో అర్థం కావడం లేదని సిబ్బంది చర్చించుకుంటున్నారు. నవీపేట్ నుంచి బదిలీ అయి పోస్టింగ్ తీసుకున్న మండలంలోని మరొకరిని పంపించేందుకు ప్రతిపాదించిన వారి స్థానంలో ప్రజాప్రతినిదుల జోక్యంతో ఇంకొకరిని పంపించారు.
రక్షించేందుకే..
బదిలీ అయిన వారిని రక్షించేందుకే ఇతరులని ఇబ్బంది పెడుతున్నట్లు శాఖలో చర్చ జరుగుతోంది. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పుకుంటున్న అధికారులు ప్రజాప్రతినిధులు చెప్పడంతో వెనక్కి తగ్గడంపై అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. అండదండాలు లేనివారు ఉద్యోగం ముఖ్యమనుకొని మండలానికి వెళ్లి పని చేసుకుంటున్నారు.
