30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

వాల్టాకు తూట్లు

Must read

📰 Generate e-Paper Clip

  • కల్దుర్కిలో వ్యవసాయ బోర్ల వద్ద తవ్వకాలు
  • ధ్వంసమౌతున్న పైపులైన్లు
  • అన్నదాతల ఆక్రందణలు పట్టించుకునేదెవరు

బోధన్, బతుకమ్మ : మంజిరా నది గర్భంలో ఇసుక రీచ్ లకు ఇవ్వక ఇవ్వక అనుమతులు ఇవ్వడంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల అనుమతులతో ఇటీవల నిజామాబాద్ జిల్లాలో మంజిరాలో కల్దుర్కి, సిద్దాపూర్ లలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. మైనింగ్ శాఖ అనుమతులు ఇచ్చిన చోట తవ్వకాలకు రెవెన్యూ అధికారులు వే బిల్లులు మంజూరు చేస్తున్నారు. వే బిల్లులు ఉన్నవాటిని పోలీసు అధికారులు అనుమతిస్తున్నారు. కానీ ఇసుకాసురులు మాత్రం ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు చేస్తూ రైతులకు కష్టాలు తెచ్చిపెడుతున్నారు. ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చి వారం రోజులు కూడా గడవకముందే రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజే రైతన్నలు ఇతర ప్రాంతాలకు చెందిన ట్రాక్టర్లు, టిప్పర్లతో తమ గ్రామ శివారులో తవ్వకాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని మొరపెట్టుకున్న పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా నది గర్భంలో రైతులు సాగుకోసం ఏర్పాటు చేసిన బోరుబావుల వద్ద తవ్వకాలు చేస్తున్నారు. బోరుబావుల నుంచి వ్యవసాయానికి నీటి సరఫరా చేసే పైపులు ధ్వంసమౌతున్నాయి. జేసీబీలు, టిప్పర్లతో జరుగుతున్న తవ్వకాలు వాల్టా చట్టానికి తూట్లు పోడుస్తున్నాయి. అనుమతులు ఇచ్చే వరకు తమ పరిధి అన్నట్లు మైనింగ్ శాఖ చూస్తుండగా తవ్వకాలు ఎక్కడ జరుగుతున్నాయనేది ఎవరు పట్టించుకోవడం లేదు. దానితో కల్దుర్కి, సిద్దాపూర్ లలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దానితో ఇసుక రవాణా కోసం, తవ్వకాల కోసం యంత్రాలు మంజిరాలోకి చొచ్చుకెళ్లి తవ్వకాలు జరుగుతుండడంతో రైతుల బోర్ల వద్ద నీటి లభ్యతకు గండిపడుతుంది. అంతేగాకుండా పైపులైన్లు ధ్వంసమౌతున్నాయి. ఇసుక తవ్వకాల విషయంలో రెవెన్యూ అధికారులు కేవలం తమకు వే బిల్లులు ఇవ్వాలని తమకేమి సంబంధం లేదని వ్యవహరిస్తున్నారు. పోలీసులు మాత్రం రూల్ ప్రకారం వే బిల్లులు ఉన్నవాటిని అనుమతిస్తున్నామని చెబుతున్నారు. కానీ రైతులకు జరుగుతున్న నష్టాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. తవ్వకాలు ఇదే విధంగా జరిగితే రైతులకు జరిగే నష్టాలను ఎవరు పూడ్చలేని పరిస్థితి నెలకొననుంది. అధికార పార్టీ పేరు చెప్పి జరుగుతున్న తవ్వకాలు స్థానిక రైతులకు కొత్త నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.

Bracelets to Walta

 

More articles

Latest article