29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

వారం రోజుల్లో 64 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 9 మందికి జైలు శిక్ష

 

. . . రూ.5.50 లక్షల జరిమానాలు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కఠిన చర్యలు కొనసాగిస్తోంది. కమిషనరేట్ పరిధిలోని అన్ని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో గత వారం రోజులుగా నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మొత్తం 64 మందిని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా, వారిలో 9 మందికి వారం రోజుల జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి సంబంధిత కోర్టులు మొత్తం రూ.5.50 లక్షల జరిమానా విధించినట్లు నిజామాబాద్ ఇన్‌చార్జ్ పోలీస్ కమిషనర్, కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు. జూన్ 8 నుంచి జూన్ 12 వరకు నిర్వహించిన వాహన తనిఖీలలో ఈ కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో నిరంతరం వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా వెంట ఉంచుకోవాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రమాదానికి కారణమైతే బీమా ప్రయోజనాలు లభించవని స్పష్టం చేశారు. మైనర్లు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే, మైనర్‌తో పాటు వాహన యజమానిపై కూడా కేసులు నమోదు చేసి చార్జ్‌ షీట్ దాఖలు చేస్తామని, జైలు శిక్ష పడే అవకాశముందని తెలిపారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఒకటి కంటే ఎక్కువసార్లు పట్టుబడిన వారికి జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. మోటార్ వెహికల్స్ చట్టం-1988 (2019 సవరణ) ప్రకారం తొలిసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10,000 జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందన్నారు. రెండోసారి పట్టుబడితే రూ.15,000 జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించబడుతుందని పేర్కొన్నారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, మద్యం సేవించినప్పుడు వాహనాలు నడపకుండా ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలను వినియోగించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article