. . . 21 న జాతీయ లోక్ అదాలత్ లో అవకాశం
. . . జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
ప్రజల న్యాయపరమైన వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి జాతీయ లోక్ అదాలత్ లు నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భారత లక్ష్మీ తెలిపారు. దిశంబర్ 21 న ఆర్మూర్, బోధన్ కోర్టులతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. సోమవారం జిల్లాకోర్టులోని తన చాంబర్లో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధ, నిజామాబాద్ ట్రాఫిక్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మస్తాన్ అలీ లతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…రాజీపడదగిన క్రిమినల్ కేసులు అన్నియు లోక్ అదాలత్ లో ఇరుపక్షాలు రాజీపద్ధతిన పరిష్కరించుకునే వీలు చట్టపరంగా ఉన్నదని ఆమె వివరించారు. అన్ని రకాల సివిల్ వివాదాలు రాజీకి అవకాశం ఉన్నవేనని ఆమె అన్నారు. ఒకసారి లోక్ అదాలత్ లో రాజీపడిన కేసులకు అవార్డులు జారీ చేస్తామని అవి అంతిమమని అన్నారు. వాటికి అప్పీలు చేసుకునే అవకాశాలు లేవని ఆమె తెలిపారు. కేసులు నమోదు చేసుకున్న రోజులలో ఉన్న కోపతాపాలు మరుసటి రోజులలో ఉండవని తెలుపుతు వివాదాలు, కక్షలుకార్పణ్యాలు లేని శాంతియుత సమాజమే అందరి అభిమతం కావాలని ఆమె ఆకాక్షించారు. సమాజంలో మనుషులుగా జీవిస్తామని ప్రతిరోజు ఒకరి ముఖాలు ఒకరం చూసుకోవలసిందేనని శత్రుత్వ భావనతో చూసుకోకుండా,సోదర భావంతో చూసుకుని కలిసిమెలిసి నడుచుకోవడంలోనే అన్ని సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. చిన్న చిన్న కేసులకు కూడా కోర్టు మెట్లు ఎక్కడం ఎక్కువైపోయిందని ఆమె విశ్లేషంచారు. దీని వలన ప్రధానమైన న్యాయ వివాదాలపై ద్రుష్టి కేంద్రీకరించడానికి కోర్టులకు సమయం సరిపోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న రుణగ్రహీతలు ఏవైనా కారణాల వలన రుణాలు బ్యాంకులకు చెల్లించని వారు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని ఆర్థిక లబ్ది పొందవచ్చని జిల్లాజడ్జి సూచించారు. చెక్ బౌన్స్ కేసులు, వినియోగదారుల వివాద కేసులు రాజీకి చేసుకుని వ్యాపారాలలో ఆర్థిక ఉన్నత స్థితికి చేరుకోవచ్చని అన్నారు.న్యాయ వివాదం తమ మధ్య ఉన్నదని ఇరుపక్షాలు భావించినప్పుడు జిల్లా న్యాయసేవ అధికార సంస్థలో ఉమ్మడిగా దరఖాస్తు దాఖలు చేస్తే శాశ్వత న్యాయ పరిష్కారం లభిస్తుందని ఆమె తెలిపారు.జాతీయ లోక్ అదాలత్ గూర్చి విశ్రుతప్రచారం ప్రజల్లోకి వెళ్లాల్సిన అవశ్యకత ఉన్నదని ఆమె అన్నారు. నిజామాబాద్ జిల్లాలో 2 లక్షల 65 వేల 968 మోటారు చట్ట ఉల్లంఘన క్రిమినల్ కేసులు నమోదు అయి ఉన్నాయని ఆమె తెలిపారు. 5 నుండి 55 వరకు ఉల్లంఘన కేసులు ఉన్న మోటారు వాహనదారులు లోక్ అదాలత్ లో వారి కేసులను పరిష్కరించుకుని 50 శాతం మినహాయింపు ఉంటుందని ఆమె తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనల ద్వారా ఉల్లంఘించిన వాహనదారులు ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉన్నదని దాని వలన వారు వారి కుటుంబానికి భారమే అవుతున్నారని ఆమె పేర్కొన్నారు. యువత అడ్డదిడ్డంగా కార్లు, బైక్ లు నడిపి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని వారు విద్య, కేరీర్ పై శ్రద్ధ చూపి దేశ ప్రగతికి చోధకశక్తులు కావాలె కాని, దేశ ఆర్థిక శక్తికి అడ్డంకులు సృష్టించే పనులు చేయరాదనీ ఆమె కోరారు. న్యాయసేవ సంస్థ జిల్లా కార్యదర్శి, సినీయర్ సివిల్ జడ్జి సాయిసుధ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ కు ప్రజలు సహకారం అందించాలని కోరారు.లోక్ అదాలత్ ను విజయతీరాలకు చేర్చుదామని ఆమె అన్నారు.

గోడ పత్రుల ఆవిష్కరణ . . .
జాతీయ లోక్ అదాలత్ విశ్రుత ప్రచారానికి వీలుగా గోడ పత్రులను జిల్లాజడ్జి భారత లక్ష్మీ, సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధ, ట్రాఫిక్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మస్తాన్ అలీ లు ఆవిష్కరించారు.