. . . రూ.41.60 లక్షల జరిమానా
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గడిచిన రెండు వారాల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 426 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. జూన్ 15, 2026 నుంచి జూన్ 27, 2026 వరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 426 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా, అందులో 10 మందికి వారం రోజుల జైలు శిక్ష విధించారు. మిగిలిన వారికి కోర్టులు మొత్తం రూ.41,60,000 జరిమానా విధించాయి. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపి ప్రమాదానికి గురైతే బీమా సదుపాయం కూడా లభించదని హెచ్చరించారు. మైనర్లు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే మైనర్‌తో పాటు వాహన యజమానిపై కూడా కేసులు నమోదు చేస్తామని, జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఒకసారి కంటే ఎక్కువ సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మోటార్ వెహికల్ చట్టం 1989 (2019 సవరణ) ప్రకారం మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందని, రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానా లేదా జైలు శిక్ష విధించవచ్చని పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిరంతర తనిఖీలు కొనసాగుతాయని పోలీస్ కమిషనరేట్ స్పష్టం చేసింది.
