29 C
Hyderabad
Monday, August 3, 2026

మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించాలి

 

. . . రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టపరిచి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌కు చెందిన డిజిటల్ – ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్‌చందానీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో ప్రధాన కార్యదర్శి సమావేశమయ్యారు. సమావేశంలో డిజిటల్ ఇండియా – వికసిత్ భారత్ – 2047 లక్ష్యాల సాధనలో భాగంగా రాష్ట్రంలో మీ సేవ కేంద్రాల ఆధునీకరణ, భారత్ ఫ్యూచర్ సిటీలో కొత్త డేటా సెంటర్ల ఏర్పాటు కోసం మౌలిక సదుపాయాల కల్పన, కృత్రిమ మేధస్సు (ఏఐ), సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), యువతకు ఐటీ ఆధారిత ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అభినందించారు. రాష్ట్రంలో డిజిటల్ సామర్థ్యాల పెంపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం, ప్రజా సేవల నాణ్యత మెరుగుదల, డేటా గవర్నెన్స్ వంటి రంగాల్లో ప్రపంచ బ్యాంక్ అందించగల సాంకేతిక సహకారం, జ్ఞాన భాగస్వామ్యం, అంతర్జాతీయ ఉత్తమ విధానాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. దేశంలో డిజిటల్ రంగంలో పెట్టుబడులకు హర్యానా, తెలంగాణ రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్న ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, సుమారు రూ.2 వేల కోట్ల పెట్టుబడుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్ లు) సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు.

. . . టి – ఫైబర్ పై సమీక్ష

అనంతరం టి – ఫైబర్ ప్రాజెక్టు పురోగతిపై ప్రధాన కార్యదర్శి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సేవల విస్తరణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. టి – ఫైబర్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు నాణ్యమైన డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో ప్రాజెక్టు అమలులో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించి, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దూరిశెట్టి, ప్రపంచ బ్యాంక్ డిజిటల్ – ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్‌చందానీ, టి-ఫైబర్ ఎం.డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Your service centers need to be further strengthened.

More articles

Latest article