నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హైపర్ టెన్షన్ పై అవగాహన కోసం నిజామాబాద్ నగరంలోని మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం 2కె రన్ నిర్వహిస్తున్నట్లు మెడికవర్ ఆసుపత్రి ఇంటర్వేషనల్ కార్డియాలజిస్టు డా.సందీప్ రావు తెలిపారు. మెడికవర్ ఆసుపత్రిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మే 17న ప్రపంచ హైపర్ టెన్షన్ డే (బీసీ దినోత్సవం)ను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు హైపర్ టెన్షన్ డే రోజున నిజామాబాద్ నగరంలోని మెడికవర్ ఆసుపత్రి నుంచి పూలాంగ్ చౌరస్తా వరకు అక్కడి నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు 2 కెరన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా డా.సందీప్ రావు మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో హైపర్ టెన్షన్ అనేది అందరిలో కనిపించే సాధారణ సమస్య అని దానిని గుర్తిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రతి వంద మందిలో బీపీ ఉన్నట్లు, 50 మంది మాత్రమే తెలుసని అన్నారు. సాధారణంగా బీపీ అనేది కొందరే పరీక్షించుకోవాలని ప్రజల్లో అపోహ ఉందని పేర్కొన్నారు. 35 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ బీపీని పరీక్షించుకోవచ్చని అన్నారు. వంద మందిలో 50 మందికి మాత్రమే తమకు బీపీ ఉందని గుర్తించగా వారిలో 25 శాతం మందికి మాత్రమే అది కంట్రోల్ ఉంటుందని తెలిపారు. బీపీ కంట్రోల్ లో లేకపోతే గుండెపోటుతో పాటు పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ కూడా 35 ఏళ్ళ దాటిన వారు కచ్చితంగా బీపీ పరీక్షలు నిర్వహించుకోవాలి, బీపీ ఉన్న వారు కచ్చితంగా దానిని కంట్రోల్ లో ఉంచుకునేందుకు మందులు వాడాల్సిందేనని తెలిపారు. బీపీ కంట్రోల్ లో లేకపోతే ఫిజిషియన్ ను కానీ కార్డియాలజిస్టును సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 20 నిమిషాల నుంచి అరగంట పాటు వ్యాయామం చేయాలని సూచించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వారికి అవగాహన కల్పించేందుకు మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 2 కె రన్ నిర్వహిస్తున్నామని దానిని విజయవంతం చేయాలని కోరారు.
