. కొత్త జిల్లాల ప్రాతిపదికన నియామకం
. కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా నియమిస్తూ జీవో విడుదల
. నియామక ఉత్తర్వులు అందజేత
నవీపేట్, బతుకమ్మ: డీఎస్పీ 2008 అభ్యర్థుల కల నెరవేరింది. సుమారు 17 ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. హైకోర్టు ఆదేశాలతో 2008 డీఎస్సీ అభ్యర్థులను సెకండరీ గ్రేడ్ టీచర్లుగా కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఉద్యోగాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 146 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కనున్నాయి. ఈ మేరకు అభ్యర్థులకు సమాచారం అందించిన జిల్లా విద్యాశాఖ శనివారం రోజున కౌన్సెలింగ్ చేపట్టింది. అభ్యర్థులు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి తమ సర్టిఫికెట్ లతో చేరుకోగా కౌన్సెలింగ్ ప్రారంభమైంది. పాఠశాల విద్యాశాఖ 2008 అభ్యర్థులకు నియామకాలు చేపట్టడంపై టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. నియామకపత్రాలు అందుకున్న వారికి ఆయన అభినందనలు తెలిపారు.

