. . . డిచ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
అప్పు తీర్చాల్సిన వ్యక్తి, కంకర రాళ్లకు బంగారం పూత పూసి వాటిని బంగారు రాళ్లుగా నమ్మించి మోసం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ నగరంలోని హమాల్వాడీకి చెందిన రమేష్‌కు శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో రూ.1.30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కొంతకాలంగా అప్పు తిరిగి చెల్లించాలని రమేష్ ఒత్తిడి చేయడంతో, తనకు గుప్తనిధులు లభించాయని, అందులో విలువైన బంగారు రాళ్లు ఉన్నాయని శ్రీనివాస్ నమ్మించాడు. అప్పు బదులుగా ఆ బంగారు రాళ్లను తీసుకోవాలని రమేష్‌ను ఒప్పించిన శ్రీనివాస్, నిజామాబాద్‌లో కాకుండా డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌కు రావాలని సూచించాడు. అలాగే, అక్కడికి వచ్చేటప్పుడు అదనంగా రూ.32 వేల నగదు తీసుకురావాలని కోరాడు. శ్రీనివాస్ చెప్పిన ప్రకారం ఘన్‌పూర్‌కు వెళ్లిన రమేష్‌కు నాలుగు కుండల్లో నాలుగు బంగారు రాళ్లను అందజేశాడు. అయితే రాళ్లపై అనుమానం రావడంతో పరిశీలించగా, అవి కంకర రాళ్లకు బంగారం రంగు పూత పూసి తయారు చేసినవని గుర్తించాడు. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు రమేష్ వెంటనే డిచ్‌పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
