. . . పోలీసుల వృత్తి నైపుణ్యాల పెంపుదలకు డ్యూటీ మీట్ దోహదం
. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్రంలో మూడవ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణలో భాగంగా జోన్-2 బాసర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ – 2026 ను నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, అదిలాబాద్ జిల్లాలకు చెందిన సి.ఐలు, ఎస్.ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ విధుల్లో సామర్థ్యాన్ని పెంపొందించడం, శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులపై అవగాహన పెంచడం, వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి సి.ఐ స్థాయి వరకు పోలీస్ సిబ్బందిలో పోటీతత్వాన్ని పెంపొందించి, దర్యాప్తు ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ పోటీలు దోహదపడనున్నాయి. ఈ సందర్భంగా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ గ్రౌండ్, పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, పోలీస్ కార్యాలయాల్లో వివిధ విభాగాల్లో ఎంపిక పరీక్షలు నిర్వహించారు.

నేరస్థల పరిశీలన, క్లూస్ సేకరణ, సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్, కంప్యూటర్స్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, ఎక్స్‌ప్లోసివ్స్, నార్కోటిక్స్, ఫింగర్ ప్రింట్స్, ఫోరెన్సిక్ మెడిసిన్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ ఎంపికలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పోలీస్ అధికారులు, సిబ్బంది తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులను సమర్థంగా వినియోగించడం ద్వారా కేసుల విచారణ మరింత నాణ్యంగా సాగుతుందని పేర్కొన్నారు. ఈ పోటీలు పోలీస్ సిబ్బందిలో ప్రతిభను వెలికితీయడంతో పాటు రాష్ట్ర స్థాయిలో రాణించే అవకాశాలను కల్పిస్తాయని తెలిపారు. జోన్ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లోనూ విజయాలు సాధించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కమిషనర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, ఏసీపీలు ప్రకాశ్ యాదవ్ (నిజామాబాద్), రాజశేఖర్ (సీటీసీ), శ్రీశైలం (సీసీఎస్), గురు నాయుడు (సీసీఆర్‌బీ), నరేందర్ (టాస్క్ ఫోర్స్), డాక్టర్ నాగేంద్రబాబు (అసిస్టెంట్ ప్రొఫెసర్ & ఇన్‌చార్జ్) తో పాటు నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, అదిలాబాద్ జిల్లాలకు చెందిన సి.ఐలు, ఎస్.ఐలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
