. . . అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సామ్రాజవాదానికి వ్యతిరేకంగా యువత పోరాడాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ అన్నారు. నగరంలోని దేవి టాకీస్ చౌరస్తాలో గల ఐఎఫ్ యు ఆఫీసులో శనివారం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో పివైఎల్ జిల్లా తొలి కన్వీనర్ కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ 35వ వర్ధంతిని నిర్వహించారు. అనంతరం ఆయనకు ఘనంగా నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రెండు కోట్లు ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చినా ఇప్పటివరకు ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. యువత డిగ్రీలు, పీజీలు చేసి రోడ్లపై ఖాళీగా తిరుగుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ రైతు కూలీల కోసం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో గంజాయి మద్యం ఏరులై పారుతున్నాయని, గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుపుతున్నారని, అవి ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శివరాజ్, నాయకులు మల్లేష్, సతీష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
