27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

యాసంగి అంచనా 11లక్షల మె.టన్నులు 

Must read

📰 Generate e-Paper Clip

  • దొడ్డు రకం 57 వేల ఎకరాలు 
  • సన్నాలు మూడున్నర లక్షలపై ఎకరాలు   

నిజామాబాద్, బతుకమ్మ: 

యాసంగిలో వరి కోతలు మొదలయ్యాయి. దాన్యం సేకరణ కోసం రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని  జిల్లా కలెక్టర్ ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశాల్లో సంబంధిత అధికారులను ఆదేశించారు.  ఖరీఫ్ లో సన్నాలకు ప్రభుత్వం రూ.500 ప్రోత్సాహకం ఇవ్వడంతో, రబీలో ఊహించని విధంగా సన్నాల సాగు విస్తీర్ణం పెరిగింది.

  • 11 లక్షల మె.ట అంచనా..

యాసంగిలో దొడ్డు, సన్నాలు కలుపుకొని 419328 ఎకరాల విస్తీర్ణంలో వరిని సాగు చేసారు. దీనిలో నుంచి  11 లక్షల 63 వేల 106 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో దొడ్డు రకాల నుంచి 164082 మె.టన్నులు, సన్నాల నుంచి 999024 మెట్రిక్ టన్నుల దాన్యం రానుందని భావిస్తున్నారు.

  • దొడ్డు రకం..

జిల్లాలో 419328 ఎకరాలలో వరి పంటను సాగు చేస్తుండగా, ఇందులో 57491 ఎకరాల్లో దొడ్డు రకాన్ని సాగు చేసారు. ఎకరాకు 28 క్వింటాళ్ళుగా భావించినా, 164082 మెట్రిక్ టన్నుల దాన్యం రావచ్చని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. సన్నాలకు బోనస్ ప్రకటించడంతో కొన్ని గ్రామాలలో దొడ్డు రకాలకు రైతులు దూరంగా ఉన్నారు. రుద్రూర్ డివిజన్ పరిధిలోని కోటగిరి, పోతంగల్, రుద్రూర్, వర్ని, చందూర్, మోస్రా, బోధన్ డివిజన్ లోని బోధన్, సాలూర్, ఎడపల్లి, రెంజల్ గ్రామాలలో దొడ్డు విత్తనాలు పడలేదు. బోధన్ డివిజన్ లోని నవీపేట్ గ్రామంలో మాత్రమే కేవలం 45 ఎకరాల్లో దొడ్డు రకాన్ని సాగు చేసారు. నిజామాబాద్ నార్త్, సౌత్ లలోనూ ఈ రకానికి దూరంగా ఉన్నారు. కమ్మర్ పల్లిలో అత్యధికంగా 11775 ఎకరాలలో దొడ్డు రకాలు సాగు అయ్యాయి.

  • సన్నాలు ..

ఖరీఫ్ లో సన్నాలు, యాసంగిలో దొడ్డు రకాలను రైతులు సాగు చేసేవారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ప్రకటన చేయడమే గాకుండా ఖరీఫ్ లో పథకాన్ని అమలు చేసింది. దీని వల్ల రబీలో సన్నాల సాగు గణనీయంగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 361837 ఎకరాలలో సన్నాలను రైతులు సాగు చేస్తున్నారు. ఎకరాకు 27 క్వింటాళ్ల దాన్యంతో, 999024 మెట్రిక్ టన్నుల దిగుబడి రానుందని అధికారులు అంచనా వేసారు. అత్యధికంగా బోధన్ లో 26481 ఎకరాలలో, అత్యల్పంగా కమ్మర్ పల్లిలో 2025 ఎకరాలలో సన్నాలు సాగయ్యాయి.

More articles

Latest article