ఇందల్వాయి, బతుకమ్మ : మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన బుధవారం ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి మండలం తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన చిన్న సంధ్యారాణి తన భూమిని మూడేళ్ల క్రితం బీఆర్ఎస్ నాయకుడికి విక్రయించింది. ఈ క్రమంలో ఆయన కొంత డబ్బు చెల్లించాడు. మూడేళ్లు గడుస్తున్నా మిగతా డబ్బుల ఇయ్యలేదు. మూడేళ్లుగా డబ్బులు అడుగుతున్నా పట్టించుకోలేదు. బాధితురాలు బుధవారం ఆయన ఇంటికి వెళ్లి డబ్బుల కోసం నిలదీసింది. దీంతో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు బాధితురాలిపై దాడి చేశారు. దీంతో బాధితురాలు చిన్న సంధ్యరాణి బీఆర్ఎస్ నాయకుని ఇంటి ముందే సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ వీడియోను పలు గ్రూపులలో ఆమె పోస్ట్ చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంధ్యారాణిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థతి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయమై బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. బాధితురాలి సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
