. . . నిజాంసాగర్ నీటి కోసం ఉద్యమం
. . . భారాసా, భాజపా ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రాలు
. . . మాజీ ఎమ్మెల్యే, భారాసా సీనియర్ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్
కామారెడ్డి, బతుకమ్మ :
వర్షాభవ పరిస్థితుల వల్ల నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగుచేసిన పంటలు ఎండిపోతుంటే పాలకులు, పట్టించుకోవడం లేదంటూ భాజపా, భారాసా నాయకులు ఉద్యమాలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం భాజపా నాయకులు తాసిల్దార్ కి వినతిపత్రం అందజేశారు. బుధవారం కోటగిరి మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయం ముందు భారాసా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఆల్ది వాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించుకోవచ్చిందని గతంలో ప్రకటించిన ప్రస్తుత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేసి, నిజాంసాగర్ ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేయించి, నిజాం సాగర్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలని బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తూ భారాసా పార్టీపై ఉన్న కక్షతో ఉద్దేశపూర్వకంగా పంటలను ఎండ కొట్టడానికి నీటిని విడుదల చేయడం లేదంటూ బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. అభివృద్ధి పనుల కోసమే కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు గొప్పగా చెప్పుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి, ఎండుతున్న పంటలు కనిపించడం లేదా ? అంటూ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. ఇటీవల జాకోర ఎత్తిపోతల పథకం ప్రారంభం వచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి నిజాంసాగర్ నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఆయన ప్రకటన ప్రకటనకే పరిమితమైందని ఆరోపించారు. తక్షణం ఇరిగేషన్ శాఖ మంత్రి ప్రకటించిన విధంగా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి ఎండుతున్న వరి, సోయా, మొక్కజొన్న, పెసర, మినుము పంటలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని బాజిరెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి తో మాట్లాడి నిజాంసాగర్ నీటిని పంటలకు విడుదల చేసే విధంగా చూడాలంటూ డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఆశించిన రీతిలో సగటు వర్షపాతం ఇప్పటివరకు నమోదు కాలేదని, చెరువులు, కుంటలు, ఎండిపోయాయని తక్షణం రైతులు వేసిన పంటలు ఎండకుండా చూడాలంటూ ప్రభుత్వం కు డిమాండ్ చేశారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలు ప్రస్తుతం వర్షాలు లేక, మరోపక్క భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ఎండుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతుల తో మహాధర్నా కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో భారాసా సీనియర్ నాయకులు జుబేర్, అంజిరెడ్డి, శ్రీనివాస్ రావు, ఎలమంచిలి శ్రీనివాసరావు, నార్ల రత్న కుమార్, గులాబీ శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
