28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ధరణి . . . భూభారతి పోర్టల్ ల అక్రమాలు వెలుగులోకి వచ్చేనా ?

Must read

📰 Generate e-Paper Clip

 

. . . గత కలెక్టర్ల హయంలో కోట్ల రూపాయల భూముల మార్పిడి

 

. . . సర్కార్ . . . అసైన్డ్ . . . ఈనామ్ భూములకు పుట్టుకొచ్చిన యజమానులు

 

. . . కోట్ల రూపాయల వెనుకేసుకున్న రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులు

 

. . . ధరణి, భూభారతి పోర్టల్ అక్రమాలపై కమిటీ వేసిన ప్రభుత్వం

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన భైపాస్ రోడ్డు వెంట ప్రభుత్వ, అసైన్డ్, ఈ నామ్ భూములకు కొదవ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో పేదలకు అప్పటి ప్రభుత్వం ప్రధానంగా దళితులకు, కొందరు వెనుకబడిన తరగుల వారికి, కొందరు మాజీ సైనికుల ఉద్యోగులకు భూములను కేటాయించింది. ఆయా భూములకు కొత్తగా బైపాస్ ఏర్పడినప్పుడు డిమాండ్ లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వందేళ్ళ చరిత్ర కలిగిన నిజామాబాద్ కలెక్టరేట్ ను కూల్చివేసి బైపాస్ లో నిర్మించిన నాటి నుంచి బైపాస్ భూములకు రెక్కలొచ్చాయి. అదే సమయంలో అక్కడ ఉన్న ప్రభుత్వ, అసైన్డ్, ఈనామ్ భూములకు కూడా కొత్త యజమానులు పుట్టుకొచ్చారు. అదేలా అంటే గత ప్రభుత్వ హయంలో కలెక్టర్లుగా, అదనపు కలెక్టర్లు (జేసీ) లుగా పని చేసిన వారు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు కుమ్మకై ల్యాండ్ సర్వే అధికారులు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఆయా భూములకు కొత్త యజమానులు పుట్టుకొచ్చారు. అప్పటి వరకు నిషేదిత భూముల జాబితాలో ఉన్న భూములకు యజమానులు మారడంతో కోట్ల రూపాయలు చేతులు మారాయి. దాదాపు 8 కిలో మీటర్ల వరకు భైపాస్ రోడ్డు మీదుగా ఈ తతంగం జరిగింది. ఆనాడు భైపాస్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం భూసేకరణ చేసింది. అందుకు రైతులకు, భూమల యజమానులకు నష్టపరిహారం చెల్లించింది. కానీ నిజామాబాద్ ల్యాండ్ సర్వేలో ఉన్న ముదుర్లు కొందరు నష్టపరిహారం చెల్లించి స్వాధీనం చేసుకున్న భూములకు కూడా పట్టాలను జారీకి ఎన్ వోసీ ఇచ్చారు. తద్వారా లక్షల రూపాయల మామూళ్ళను పొందారు. అదీ చాలదన్నట్లు భైపాస్ వెంట ఒకప్పుడు వ్యవసాయానికి తప్ప దేనికి పనికిరాని భూములు నిషేదిత జాబితాలో ఉండడంతో గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్, భూభారతి రికార్డులను అనుకూలంగా మార్చుకుని వాటికి కొత్త యజమానులను తయారు చేశారు. నిజామాబాద్ భైపాస్ మొదలుకుని దాస్ నగర్ వరకు, ఇటు మాదవనగర్, అటు అర్సపల్లి నుంచి సారంగాపూర్ వరకు, ఇటు పాంగ్రా నుంచి డిచ్ పల్లి వరకు భూములకు రాత్రికి రాత్రి యజమానులు మారిపోయారు. ఏకంగా కలెక్టర్ చేతుల్లో ఉండే బయోమెట్రిక్ ద్వారానే ఈ తతంగం నడిచింది. నిషేదిత భూములు, పడావు భూముల్లో ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత భూ భారతి రికార్డులను చూపుతూ ఏకంగా తక్కువ ధరకు భూ మాఫియా భూములను కొట్టేసింది. మొన్నటి వరకు యజమానులు మారరు అని ధీమాతో ఉన్న దళితులు, గిరిజనులు, మాజీ సైనికోద్యోగులు, బడుగు, బలహీన వర్గాల వారు ల్యాండ్ మాఫియాకు అగ్వ సగ్వకు  భూములను అమ్ముకున్నారు. ల్యాండ్ మాఫియా, రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులతో కుమ్మకై ఏకంగా జిల్లా అధికార యంత్రాంగాన్నే బుట్టలో వేసుకుని భూములకు పత్రాలను సృష్టించి కొట్టేశారు.

 

will-the-irregularities-in-the-dharani-and-bhu-bharathi-portals-come-to-light

 

ఒకప్పుడు పడావు, బంజరు భూములుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా, గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలుగా, లగ్జరీ విల్లాలు నిర్మించే ప్రాంతాలుగా మారిపోయాయి. ల్యాండ్ మాఫియాకు అధికార యంత్రాంగం తోడు కావడంతో చాలా మంది బినామీలు, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి కోట్లకు పడుగలెత్తారు. ఒకప్పుడు పశువుల కాపరులుగా ఉన్న వారు కూడా బిల్డర్లుగా, రియాల్టర్లుగా రాణించడం వెనుక భూ మాఫియా ఉందని రికార్డులు చెబుతున్నాయి. గూపన్ పల్లి, ముబారక్ నగర్, దాస్ నగర్, మాణిక్ భండార్, కాలూర్, ఖానాపూర్, పాంగ్రా, బోర్గాం, అర్సపల్లి, సారంగాపూర్ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వెంచర్లుగా ప్రస్తుతం ఉన్న భూముల్లో చాలామట్టుకు నిషేదిత భూములు ఉండడం విశేషం. నిజామాబాద్ – ఆర్మూర్, నిజామాబాద్ నయా కలెక్టరేట్ నుంచి – మాదవనగర్ వరకు ఉన్న భూములను కొనుగోలు చేసి వెంచర్లు చేయడం వెనుక ల్యాండ్ మాఫియా వెనుక రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారుల హస్తం ఉందనేది అందరికీ తెలిసిందే. సంబంధిత రెండు శాఖలు గతంలో పని చేసిన కలెక్టర్లను మొదలుకుని జేసీ, ఆర్డీవోలను మేనేజ్ చేసుకుని భూములను నిషేదిత జాబితాలో నుంచి తొలగించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ వ్యవహరంలో వాటాలుగా, డబ్బులు ఇవ్వకుండా జేసీ, ఆర్డీవో, తహసీల్ధార్ స్థాయి అధికారులకు కూడా వెంచర్లలో ప్లాట్లను ఎరగా వేసిన విషయం జగమెరిగిందే. నిజామాబాద్ లో పని చేసిన ఒక జేసీ స్థాయి అధికారికి డబ్బుల బదులు 200  ఎకరాల వెంచర్ లో ప్లాట్లు నజరానాగా ఇచ్చినట్లు ప్రచారం ఉంది. ఎందుకంటే సంబంధిత వెంచర్ లో ఉన్న నీటి పారుదల శాఖ కాలువలు, అసైన్డ్, ఈనామ్ భూమి ఇప్పుడు కనిపించకపోవడమే నిదర్శనమని చెబుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి, భూ భారతి పోర్టల్ ద్వారా అక్రమాలు జరిగినట్లు గుర్తించి బాధ్యులపై చర్యలకు కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. సంబంధిత కమిటీ అన్ని జిల్లాల్లో భూముల మార్పిడి ప్రధానంగా ధరణి, భూభారతి పోర్టల్ వ్యవహరంలో జరిగిన అక్రమాలపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. సంబంధిత అధికారులు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జరిగిన ధరణి పోర్టల్ సిస్టమ్ నిర్మాణంలో సహజసిద్ధమైన భద్రతా లోపాలు ఉన్నాయని, వాటిని కొందరు అక్రమ శక్తులు దుర్వినియోగం చేసి కొన్ని మాడ్యూళ్ల ద్వారా అనధికారిక ఎంట్రీలు అయినట్లు తేలింది. అలాగే (నేషనల్ ఇన్ ఫర్మేటిక్ సెంటర్) రూపొందించిన భూ భారతి పోర్టల్ కూడా ధరణి ఆధారిత సాంకేతిక నిర్మాణాన్ని అనుసరించడం వల్ల అదే తరహా లోపాలకు గురయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఆనాడు ధరణి పోర్టల్ ద్వారా మాడ్యూల్స్ రూపొందించిన వ్యక్తులే దీని వెనుక ఉన్నట్లుగా ప్రభుత్వం అనుమానిస్తుంది. ధరణి పోర్టల్ సిస్టమ్ నిర్మాణంలో సహజ సిద్ధమైన భద్రతా లోపాలు ఉన్నాయని,  వాటిని కొందరు అక్రమ శక్తులు దుర్వినియోగం చేసి కొన్ని మాడ్యూళ్ల ద్వారా అనధికారిక ఎంట్రీలు చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో బాధ్యులను గుర్తించడం, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ప్రారంభించడం  భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు సూచించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ నిజామాబాద్ జిల్లాలోనూ వివరాల సేకరణలో పడింది.

 

will-the-irregularities-in-the-dharani-and-bhu-bharathi-portals-come-to-light

More articles

Latest article