26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఏసీబీ సోదాలతో రవాణా శాఖలో వసూళ్ళు ఆగేనా?

Must read

📰 Generate e-Paper Clip

  • రవాణా శాఖ ఆదాయానికి గండి కొడుతున్న అధికారులు
  • తనిఖీలలో వాహనాలను వదిలేస్తున్న వైనం
  • నిబంధనలకు విరుద్దంగా ఆర్టీఏ కార్యాలయం వద్ద దుకాణాలు
  • ఏజంట్లతో పనులు కానిచ్చేస్తున్న అధికారులు
  •  చెక్ పోస్టుల వద్ద ప్రైవేట్ వ్యక్తులతో వసూళ్ళు

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం (ఆర్టీఏ) పై ఏసీబీ ఆకస్మిక తనిఖీలు కొత్త చర్చకు దారి తీసింది. దాదాపు పుష్కరకాలం తర్వాత నిజామాబాద్ ఆర్టీఏ కార్యాలయంపై ఏసీబీ సోదాలు జరిగాయి. దశాబ్ధ కాలం గడిచిన ఇప్పటి వరకు రవాణా శాఖలోని అవినీతి తిమింగళాలు ఏసీబీకి చిక్కలేదు. గడిచిన ఏడాది సాలురా, సలబత్ పూర్ చెక్ పోస్టులతో పాటు కామారెడ్డి శివారులోని చెక్ పోస్టులో తనిఖీలు నిర్వహించినా అక్కడ కూడా ఎవరు చిక్కలేదు. రవాణా శాఖాధికారులు ముందుజాగ్రత్త వహిస్తుండడంతో వారు ఏసీబీకి రెడ్ హ్యండెడ్ గా చిక్కడం లేదు. ప్రభుత్వానికి ఆదాయాన్ని ఆర్జించి పెట్టే రవాణా శాఖలో అవినీతి అధికారుల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఐదు యూనిట్ కార్యాలయాలు ఉన్నాయి. పదుల సంఖ్యలో మోటార్ వెహికిల్ ఇన్స్ పెక్టర్లు, ఏఎంవిఐలు పని చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మూడు చెక్ పోస్టులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం సీజనల్ గా విద్యా సంస్థ వాహనాల ఫిట్ నెస్ అనేది నామమాత్రంగా సాగుతుంది. చెక్ పోస్టుల వద్ద వసూళ్ళు మాత్రం ఆగడం లేదు. ఆయా చెక్ పోస్టుల వద్ద ప్రైవేట్ వ్యక్తులను నియమించుని వారి చేతనే వాహనాలను నిలిపి రెగ్యులర్ గా వాహనానికి టార్గెట్ రేట్ ఫిక్స్ చేసి వసూల్ చేస్తున్నారు. రవాణా శాఖాధికారులు టార్గెట్ కోసం తనిఖీలు నిర్వహించగా నిత్యం జరిగే తంతుగా మారింది. రవాణా శాఖకు ఆదాయం అటుంచి ఏంవీఐలు తనిఖీలు చేసినప్పుడు నిత్యం 50 వేలకు తక్కువగా లేకుండా వసూళ్లు చేసుకుని వెళ్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇసుక క్వారీలకు, రీచ్ లకు అనుమతి లేకపోయినా ఇల్లీగల్ గా ఇసుక దందా నడుస్తోంది. ఆయా భారీ వాహనాల్లో పరిమితికి మించి వాహనాల్లో ఇసుక తరులుతుంటే ఆయా వాహనాలకు జరిమానాలు విధించాల్సిన రవాణా శాఖాధికారులు ఏకంగా క్వారీల నిర్వాహకులతో కుమ్మకయ్యారన్న వాదనలున్నాయి. వారి వద్ద లాలూచి పడి రోడ్లు ధ్వంసం అవుతున్నా, ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్న అవేమి లెక్క చేయకుండా వసూళ్ళకు తెగబడుతున్నారని బహిరంగ ఆరోపణలున్నాయి.
రవాణా శాఖ కార్యాలయాలకు కిలో మీటర్ దూరం వరకు ఏజంట్లకు సంబంధించిన షెడ్డులు కానీ, షాప్ లలో కార్యకలాపాలు నిషేదం. కానీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీఏ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ ఉండే ఆఫీస్ ముందే పదుల సంఖ్యలో ఏజంట్లు దుకాణాలు తెరిచి అధికారులకు సహకరిస్తున్నారు. ఏజంట్ల ద్వారానే అన్నీ కార్యకలాపాలు చక్కబెడుతున్నారని ఈ నెల 12న జరిగిన ఏసీబీ సోదాలలో బహిర్గతమైంది. ఏజంట్ల ద్వారా డబ్బులు తీసుకుంటూ వారికే నేరుగా పనులు చేయడంతో వారి చేతికి మట్టిఅంటకుండా, ఏసీబీకి చిక్కకుండా తప్పించుకుంటున్నారు. కామారెడ్డి, బోధన్ , ఆర్మూర్, బాన్సువాడ యూనిట్ కార్యాలయాల్లోనూ ఏజంట్లదే హవాగా మారింది. ఏజంట్లు చెప్పినట్లే కోడ్ ల ద్వారా వసూళ్ళ కార్యక్రమం జరుగుతుంది. ఏసీబీ పేరు చెప్పి తనిఖీలు జరిగితేనే వెనక్కి అధికారులు మిగితా రోజుల్లో సాధారణంగానే మామూళ్ళు తీసుకుంటున్నారు. ప్రతిఫైల్ కు ఒక రేటు ఫిక్స్ చేసి అవి అందితేనే ఫైళ్లు ముందుకు కదలడం అనేది రవాణా శాఖలో నిత్యతంతుగా మారింది. చెక్ పోస్టుల వద్ద ఇదే పరిస్థితి కొనసాగుతుంది. చెక్ పోస్టు డ్యూటీలు అంటే రోజు కాసుల గలగలనే అని చెబుతున్నారు.

More articles

Latest article