. . . ఏర్గట్ల మండల భాజపా అధ్యక్షుడు తోర్తి గంగారెడ్డి
ఏర్గట్ల, బతుకమ్మ :
బాల్కొండ నియోజకవర్గంలో బట్టపూర్ కంకర క్వారీ వివాదం మరింత రాజకీయ దుమారం రేపుతోంది. ఏర్గట్ల మండల కేంద్రంలో శనివారం మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు తొర్తి గంగారెడ్డి, ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పటు చేశారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు గంగారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డిని ఉద్దేశించి బట్టపూర్ కంకర క్వారీపై బహిరంగ చర్చలు ఎక్కడ అంటూ ప్రశ్నించిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ బట్టపూర్ క్వారీలో జరిగిన అవినీతిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. కంకర క్వారీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుల మధ్య కేవలం మాటల యుద్ధమే కొనసాగుతోందని, కానీ బహిరంగ చర్చలు, స్పష్టమైన చర్యలు లేవని విమర్శించారు. ఇటీవల జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై పోలీసులు విచారించి విడుదల చేసిన ముత్యాల సునీల్ రెడ్డిపై ప్రముఖ బీఆర్ఎస్ నాయకుడు విమర్శలు చేయగా, ప్రతిగా సునీల్ రెడ్డి స్పందించారని గుర్తు చేశారు. ఆ సందర్భంగా సంక్రాంతి తర్వాత బట్టపూర్ కంకర క్వారీ అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరిన సునీల్ రెడ్డి, క్వారీ యజమానులకు ‘సినిమా చూపిస్తా’ అంటూ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అయితే సంక్రాంతి ముగిసి 15 రోజులు గడిచినా ఇప్పటివరకు సినిమా కాదు కదా ట్రైలర్ కూడా చూపించలేదని ఎద్దేవ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్ మాజీ మండల ఏర్గట్ల బీజేపీ అధ్యక్షుడు ఏలేటి నారాయణరెడ్డి, మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో బట్టపూర్ కంకర క్వారీలో అనుమతికి మించి వేల క్యూబిక్ మీటర్ల రాయి తవ్వకాలకు సంబంధించి భాజపా అభ్యర్థి మల్లికార్జున్ రెడ్డి ఆధారాలతో కోర్టును ఆశ్రయించగా, క్వారీ మూసివేతతో పాటు జరిమానా విధించాలని తీర్పు వచ్చిందని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నప్పటికీ బాధ్యులపై చర్యలు ఎక్కడని ప్రశ్నించారు. అలాగే నిమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ, బట్టపూర్ క్వారీపై విధించిన జరిమానాలను రాబట్టి ఆ నిధులను మండల అభివృద్ధికి వినియోగిస్తే అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తంగా ప్రముఖ బిఆర్ఎస్ నాయకుడు, ముత్యాల సునీల్ రెడ్డి, మధ్య ఆరోపణలు కొనసాగుతున్నప్పటికీ, బహిరంగ చర్చలు, స్పష్టమైన చర్యలు లేకపోవడమే ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిందని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా చర్చలకు ఎప్పుడు, ఎక్కడ సిద్ధమవుతారో ప్రకటించాలని మండలంలోని బీజేపీ సీనియర్ నాయకులు పలువురు డిమాండ్ చేశారు.
