24.7 C
Hyderabad
Monday, August 3, 2026

కస్టోడియల్ డెత్ లో అధికారులపై చర్యలేవి? 

Must read

📰 Generate e-Paper Clip

  • ఠాణాలో ఆత్మహత్య కేసులో శాఖపరమైన యాక్షన్ ఆలస్యం
  • కానిస్టేబుల్ ను బలి చేసి అధికారులను తప్పిస్తున్నారా?
  • కొనసాగుతున్న రెంజల్ పీఎస్ లో ఫోక్సో నిందితుడి ఆత్మహత్య కేసు  

నిజామాబాద్, బతుకమ్మ  :  నిజామాబాద్ జిల్లాలో చాలా రోజుల తర్వాత పోలీసు కస్టడిలో ఉన్న నిందితుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసు శాఖ విచారణ సాగదీత దోరణిలు కొనసాగుతుంది.ఈ కేసులో ఇప్పటి వరకు ఒక కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయగా రెంజల్ ఎస్సైతో పాటు సర్కిల్ సిఐకి, ఇతర సిబ్బందికి మెమో జారీ చేశారు. ఈ కేసులో జ్యుడిషియల్ విచారణ జరుగుతుండగా , పోలీసు శాఖ కూడా తుఫ్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి శాఖపరమైన విచారణ చేపట్టారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్ళే కారణమనే వాదనలున్నాయి. ఏరికోరి పోలీస్ స్టేషన్ లలో నియమించిన నేతలు వారిని కాపాడేందుకు అధికారులపై చర్యలకు మోకాళ్లొడ్డుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

రెంజల్ మండలంలోని ఒక తాండకు చెందిన రత్నావత్ రెడ్యా అనే వ్యక్తి మతిస్థిమితం లేని బాలికపై అఘాయిత్యానికి  పాల్పడ్డారని గ్రామస్తులు, బాలిక కుటుంబ సభ్యులు అతన్ని చితకబాదారు. ఈ విషయంలో తాండలో ఘర్షణ వాతావరణం నెలకొనగా కొందరు డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో రత్నావత్ రెడ్యాను పోలీసులు అదపులోకి తీసుకుని ప్రాథమిక చికిత్సను అందించి స్టేషన్ కు తరలించారు. అతన్ని విచారించిన పోలీసులు రెడ్యాపై ఫోక్సో కేసు నమోదు చేశారు. రాత్రివేళ 2 గంటల ప్రాంతంలో పోలీస్ కస్టడిలో ఉన్న రత్నావత్ రెడ్యాను తన ప్యాంట్ నాడాతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే పోలీసులు ఎక్కడా ఆ కేసు తమకు చుట్టుకుంటుందోనని రత్నావత్  రెడ్యా మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం చేయడంతో బాలిక బంధువులు దాడిలోనే తీవ్రంగా గాయపడిన రెడ్యా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటి వరకు ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసిన రత్నావత్ రెడ్యా భార్య తన భర్త గ్రామస్తుల దాడిలో చనిపోలేదని ఉరి వేసుకున్నాడని నేరుగా ఇంచార్జి పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో కేసు పోలీసుల మీదకు మళ్లింది.

ఇప్పటికే రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో హాట్ హాట్ గా చర్చ జరుగుతుండగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టం ముందు అందరూ సమానమేనని బాధ్యులైన వారు ఎంతటి వారైనా చట్టం తన పని తాను  చేసుకపోతుందని సినీ నటుడు అల్లుఅర్జున్ పై నమోదయిన కేసులో శనివారం అసెంబ్లీలోనే కుండబద్దలు కొట్టారు. కానీ నిజామాబాద్ జిల్లాకు వచ్చేసరికి సంబంధిత నిబంధనలు పోలీసు అధికారులకు వర్తించవేమోనన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కేవలం కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి, అధికారులకు మెమోలతో సరిపెట్టడం ఎంత వరకు సమంజసమన్న వాదనలున్నాయి. అందరికీ ఒకే  న్యాయం , ఒకే చట్టమైనప్పుడు పోలీసు కస్టడిలో ఉన్న నిందితుడు ఆత్మహత్య చేసుకుంటే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా కాపాడడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్న తలెత్తుంది.

More articles

Latest article