25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

వేతనాలు పెంచకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీయుసీఐ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఎల్.పద్మ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

కేజీబీవీ, యూఆర్‌ఎస్, మోడల్ స్కూల్ హాస్టళ్లలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలను తక్షణమే అమలు చేసి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఎల్.పద్మ డిమాండ్ చేశారు. డిమాండ్లను పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేసి, “చలో హైదరాబాద్” కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. నిజామాబాద్ నగరంలోని టీఎన్‌జీఓస్ భవన్‌లో ఆదివారం నిర్వహించిన ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా జనరల్ బాడీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు, రాష్ట్ర కార్యదర్శి ఎం.సుధాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. వారు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం, రోజురోజుకు పనిభారం అధికమవుతుండటంతో కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధిక పనిభారం కారణంగా అనారోగ్యాలకు గురవుతూ, పలువురు ఉద్యోగాలు వదిలివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, పదవీ విరమణ ప్రయోజనాలు లేకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.

 

We will stage state-wide protests if wages are not increased.

 

విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఖాళీ పోస్టులతోనే పనులు కొనసాగుతున్నాయని, దీంతో ఉన్న ఉద్యోగులపై అదనపు భారం పడుతోందని విమర్శించారు. వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ వయస్సును 65 సంవత్సరాలకు పెంచి, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రూ.5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని కోరారు. నాన్ టీచింగ్ వర్కర్లకు నైట్ డ్యూటీలను రద్దు చేసి, వీక్లీ ఆఫ్‌ను కచ్చితంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మోడల్ స్కూల్ హాస్టళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి కేజీబీవీ సిబ్బందితో సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అన్యాయానికి గురైన నాన్ టీచింగ్ వర్కర్ల సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం కూడా మూడేళ్లుగా పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాల పెంపుతో పాటు అన్ని న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఎం. నరేందర్, జిల్లా అధ్యక్షురాలు హేమలత, జిల్లా కార్యదర్శి సుమలత, రాష్ట్ర నాయకులు ఈశ్వరి, శశికళ, సునీత, జిల్లా ఉపాధ్యక్షులు సంధ్య, సుజాత, సహాయ కార్యదర్శి శోభ, జిల్లా నాయకులు సుమలత, జీవ, శాంతాతో పాటు వివిధ కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టళ్ల నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

 

We will stage state-wide protests if wages are not increased.

More articles

Latest article