వెబ్ న్యూస్, బతుకమ్మ : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కిష్టరాంపల్లి, నక్కల గండి ప్రాజెక్టుల భూ నిర్వాసితుల గోడును పట్టించుకోకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయిన ఘటనలో కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని కవిత ప్రశ్నించారు. జాగృతి జనం బాటలో భాగంగా బుధవారం నల్గొండ జిల్లాలో కవిత మాట్లాడారు. కృష్ణా జలాలపై ఆధారపడి ఉన్న ఈప్రాంతానికి నాగార్జన సాగర్ కూతవేటు దూరంలో ఉన్నా సాగు, తారు నీరు లేదని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చి రెండేళ్లైనా అడిగే వారే లేరని, అందుకే సమస్యలపై ప్రశ్నించేందకు తెలంగాణ జాగృతి ముందుకు వచ్చిందన్నారు. మా కార్యకర్తలు హోర్డింగులు, బ్యానర్లు పెడితే అరెస్ట్ చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అవకాశం, అధికారం, ఆత్మగౌరవం లక్ష్యంగా పోరాటం చేస్తామన్నారు. సమస్యల పరిష్కారం కోసం మంత్రులు కృషి చేయాలన్నారు.
