. . . పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ :
2028 నాటికి పోలీసు శాఖలో విడతలవారీగా నియామకాలు చేపడుతూ అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పోలీసు శాఖలో సిబ్బంది కొరత అన్నది లేకుండా సంపూర్ణంగా నియామకాలు చేపడుతామని స్పష్టం చేశారు. సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆహారం కల్తీ వంటి మారుతున్న నేర స్వభావాలు, సవాళ్లను ఎదుర్కోవడంలో పోలీసు శాఖను బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీసు అమరుల త్యాగాలను గౌరవిస్తూ, వారి ఆశయాలను కొనసాగిస్తూ శాంతియుతమైన, సురక్షితమైన,అభివృద్ధి చెందిన తెలంగాణను నిర్మించుకుందామని సీఎం పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్పీకరించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ శాంతి భద్రతల ప్రాధాన్యత,పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఎంతో భావోద్వేగమైన రోజు. సమాజం కోసం ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరులకు నివాళులర్పిస్తున్నాను. దేశవ్యాప్తంగా ఈ ఏడాది విధి నిర్వహణలో 154 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులతో పాటు శాంతిభద్రతలు ఎంతో ముఖ్యం. ప్రజలు నిర్భయంగా జీవించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, పరిశ్రమలు, ఐటీ, పర్యాటక రంగాల అభివృద్ధికి శాంతిభద్రతల పరిరక్షణ కీలకమని, అందుకే ప్రజా ప్రభుత్వం పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. 2025 అక్టోబర్ నాటికి దాదాపు 16 వేల మంది కానిస్టేబుళ్లు, ఎస్ఐలను నియమించామని, 2026లో మరో 5 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతించాం. ఇందులో భాగంగా 4773 కానిస్టేబుళ్లు, అగ్నిమాపక,జైళ్ల శాఖలకు సంబంధించిన పోస్టులతో కలిపి 7437 పోస్టుల భర్తీకి అనుమతిని, ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 112 మంది డీఎస్పీలను నియమించామన్నారు. ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించి వారి ఆత్మగౌరవాన్ని పెంచామని, విధి నిర్వహణలో వీరమరణం పొందిన కానిస్టేబుళ్ల ఎక్స్‌గ్రేషియాను రూ. 40 లక్షల నుంచి రూ. 1 కోట్లకు, హెడ్ కానిస్టేబుళ్లు,ఏఎస్ఐల పరిహారాన్ని రూ. 45 లక్షల నుంచి రూ.1 కోట్లకు పెంచాం. ఎస్ఐలకు రూ. 1.25 కోట్లు, ఇన్స్పెక్టర్లకు రూ. 1.25 కోట్లు,డీఎస్పీ,అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులకు రూ. 1.25 కోట్లు, ఎస్పీ, ఐపీఎస్ అధికారులకు రూ.2 కోట్ల పరిహారం అందిస్తున్నామని,అమరుల కుటుంబాల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, ఉచిత విద్య, వైద్య సహాయం అందిస్తున్నామన్నారు. వైద్య విద్యలో ప్రత్యేక సీట్లు కల్పిస్తున్నామని, భద్రతా సంక్షేమ నిధి నుంచి రూ. 16 లక్షలు, సంక్షేమ నిధి నుంచి మరో రూ.8 లక్షలు అందించాలని నిర్ణయించామన్నారు. హోంగార్డుల కుటుంబాలకు ప్రస్తుతం అందిస్తున్న రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాను రూ. 10 లక్షలకు పెంచాలని డీజీపీని ఆదేశిస్తున్నామని, హోంగార్డుల వైద్య పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వాలి.పోలీసు సిబ్బంది పిల్లల విద్య కోసం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో 44 ఎకరాల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించామన్నారు. డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ ఫోర్స్ పనితీరును అభినందిస్తున్నామని, కల్తీ ఆహార నియంత్రణకు టీజీ సేఫ్‌ను ప్రారంభించామన్నారు. షీ టీమ్స్ సేవలను కొనసాగిస్తున్నామని, మహిళలకు అండగా నిలిచేందుకు స్టాండ్ విత్ హర్ కార్యక్రమాన్ని,అత్యవసర పరిస్థితుల్లో తక్షణ రక్షణకు స్పందన బృందాలను ప్రారంభించాం.మహిళలు,చిన్నారులకు సంబంధించిన కేసుల్లో పోలీసులు సున్నితంగా వ్యవహరించాలన్నారు. బాధితులకు న్యాయం అందించడంలో జాప్యం జరగకూడదని, మహిళల భద్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత.అమరుల కుటుంబ సభ్యులకు ఒక మాట చెబుతున్నానని, మీరు కోల్పోయిన వ్యక్తిని ఎవరూ తిరిగి తీసుకురాలేరని, కానీ మీ బాధలో మీరు ఒంటరివారు కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసు శాఖ సమాజం మీకు అండగా ఉంటాయి.పోలీసు సిబ్బంది క్రమశిక్షణే వారి బలం,నిజాయితీయే వారి గౌరవమని, ప్రజలకు భరోసా కల్పిస్తూ వారి భద్రతకు అండగా నిలవాలని, వారి సంక్షేమానికి,కుటుంబాల భవిష్యత్తుకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది. అమరుల త్యాగాలను గుర్తించామని, వారి కుటుంబాలకు అండగా నిలబడటమే నిజమైన గౌరవమని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే సామాన్యులతో స్నేహపూర్వకంగా, నేరస్థులతో కఠినంగా వ్యవహరించాలని, అమరుల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
