27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ప్రజా సమస్యల పరిష్కారానికి సంఘటితంగా కృషి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వ వాతావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించాలని సద్భావన ఫోరమ్ సభ్యులు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో సద్భావన ఫోరమ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో సమాజ సామరస్యం, ప్రజా హక్కులు, పౌర బాధ్యతలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇటీవల ఆర్మూర్‌లో ఓ ఉపాధ్యాయుడిపై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సమాజంలోని అన్ని వర్గాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చట్టాన్ని గౌరవిస్తూ సమస్యలను శాంతియుత మార్గంలో పరిష్కరించుకోవాలని కోరారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, వివిధ రంగాల అనుభవజ్ఞులు రోజుకు కనీసం అరగంట సమయాన్ని సామాజిక సేవకు కేటాయించి, సంఘటిత బృందాలుగా పనిచేస్తే సమాజానికి మరింత మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. జిల్లాలో తాగునీటి సమస్యలు, బోర్‌వెల్స్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో జాప్యం, నిరుద్యోగం, ఇతర ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలతో కలిసి ఉద్యమించాలని సద్భావన ఫోరమ్ నిర్ణయించింది. ప్రజా సమస్యలను కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి సమస్యగా భావించి, వాటి పరిష్కారం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో షేక్ హుస్సేన్, మహ్మద్ జహీరుద్దీన్, బంగారు సాయిలు, కృపాల్ సింగ్, న్యాయవాది పులి జైపాల్, రాంచందర్, శివ, సత్యనారాయణ, నారాయణ రెడ్డి, రాజు, కిషన్ గౌడ్, సిర్ప లింగం తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article