. . . జిల్లా అధ్యక్షుడు కోయడి నర్సింలు గౌడ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడి అమరులైన నాయకులను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న “అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్ర” ను విజయవంతం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కోయడి నర్సింలు గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం హమాల్‌వాడిలోని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి ప్రసాద్ చేతుల మీదుగా “అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర” పోస్టర్‌ను ఆవిష్కరించారు. నాయకులు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో ఆగస్టు 2న ప్రారంభమయ్యే ఈ బస్సు యాత్ర ఆగస్టు 18 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొనసాగి, పాపన్న జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ముగుస్తుందని తెలిపారు. ఈ యాత్రలో కల్లుగీత కార్మికులు, గౌడ సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని పేర్కొన్న నాయకులు, వృత్తి ప్రమాదాలకు గురైన కార్మిక కుటుంబాలకు పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి కల్లుగీత కార్మికునికి ద్విచక్ర వాహనాలు (బైకులు) అందజేయడంతో పాటు ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు పెద్ది వెంకట్రాంలు, జిల్లా ఉపాధ్యక్షుడు సేపూరు సాయిగౌడ్, సంఘం నాయకులు శ్రీరాం గౌడ్, రామరాజు, ముత్తన్న, భాస్కర్, లింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
