- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రాంత పసుపు రైతులకు చేసిన వాగ్దానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అధిక విస్తీర్ణంలో పసుపు పండించే నిజామాబాద్ జిల్లాలో బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు, ఇదే జిల్లాకు చెందిన రైతు బిడ్డ పల్లె గంగారెడ్డిని బోర్డు చైర్మన్ గా నియమించామని గుర్తు చేశారు. నిజామాబాద్ లో నూతనంగా నెలకొల్పిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి అనసూయ సీతక్క, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పసుపు బోర్డు వైస్ చైర్మన్ భవాని, ఇతర ఉన్నతాధికారులు, కార్పొరేషన్ల చైర్మన్లు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవ సంరంభంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా బస్వా గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, పసుపు బోర్డు కార్యాలయానికి ప్రారంభోత్సవం చేసే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని హర్షం వెలిబుచ్చారు. ఆహార పదార్థాలలోనే కాకుండా, శుభ కార్యాలలో, ఔషధ తయారీలలో విరివిగా వినియోగించే పసుపు పంటను నిజామాబాద్ జిల్లా రైతాంగం అధికంగా సాగు చేస్తోందని, అందుకే ఈ ప్రాంత రైతుల ఆకాంక్షను గౌరవిస్తూ ప్రధాని మోదీ నిజామాబాద్ లో పసుపు బోర్డును నెలకొల్పారని అన్నారు. నిజానికి 2023 లోనే బోర్డు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అయ్యిందని, ఈ ఏడాది ఆరంభంలో కేంద్రం పసుపు బోర్డు ప్రకటన చేసిందని, ఇప్పుడు బోర్డు కార్యాలయాన్ని కూడా ప్రారంభించిందని అమిత్ షా వెల్లడించారు. పసుపు సాగు ద్వారా యావత్ దేశంలోని ప్రజలందరికీ ఆరోగ్యాన్ని పంచుతూ, దేశ సమృద్ధికి పాటుపడుతున్న పసుపు రైతులకు అండగా నిలవాలని సంకల్పంతోనే కేంద్రం బోర్డును ఏర్పాటు చేసిందన్నారు. దేశంలోనే అత్యధికంగా నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల్, కామారెడ్డి జిల్లాలలో పసుపు పంట సాగు చేస్తున్నారని అమిత్ షా గుర్తు చేశారు. అనేక దశాబ్దాలుగా ఈ పంట పండిస్తున్నప్పటికీ పసుపు రైతులకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా లాభాలు సమకూరడం లేదని అన్నారు. ప్రస్తుతం బోర్డు ఏర్పాటు వల్ల పసుపు రైతులకు ఇప్పుడు అందుతున్న మద్దతు ధర కంటే రానున్న రెండు మూడు సంవత్సరాల కాలంలోనే క్వింటాలుకు అదనంగా కనీసం రూ. 7000 వరకు ఎక్కువ ధర లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ద్వారా రైతులకు నాణ్యమైన పంటను సాగు చేసేలా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు మార్కెటింగ్, ఎగుమతులు, బ్రాండింగ్ వంటి వాటిని మెరుగుపరచడం జరుగుతుందని, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని అన్నారు. 2030 వరకు అంతర్జాతీయ స్థాయిలో ఒక మిలియన్ డాలర్ల విలువ చేసే పసుపు ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అమిత్ షా వెల్లడించారు. అంతర్జాతీయ ఎగుమతుల వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం భారత్ కో-ఆపరేటివ్ ఎక్స్ పోర్ట్ లిమిటెడ్, ఆర్గానిక్ పంటను ప్రోత్సహించేందుకు భారత్ ఆర్గానిక్ కో-ఆపరేటివ్ ఎక్స్ పోర్ట్ లిమిటెడ్ సంస్థలను నెలకొల్పిందని గుర్తు చేశారు. ఈ ప్రాంత పసుపు రైతులకు మరింత మేలు చేకూరేలా ఎక్స్ పోర్ట్ లిమిటెడ్ సంస్థల శాఖలను నిజామాబాద్ లో కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

- పసుపు రైతుల కల నెరవేర్చిన కేంద్రానికి ధన్యవాదాలు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణ ప్రాంత పసుపు రైతుల చిరకాల వాంఛను గుర్తించి పసుపు బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు. అత్యధిక విస్తీర్ణంలో పసుపు సాగు చేసే నిజామాబాద్ జిల్లాలో బోర్డును నెలకొల్పడం వల్ల ఈ ప్రాంత రైతుల పోరాటం ఫలించినట్లయ్యిందని అన్నారు. జాతీయ పసుపు బోర్డుతో నిజామాబాద్ జిల్లా ప్రతిష్ట మరింతగా ఇనుమడిస్తుందని, పసుపు రైతులకు ఇతోధికంగా మేలు జరుగుతుందని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ బోర్డు ఏర్పాటు పసుపు పంట ఎగుమతులు, ఆధునాతన సాగు విధానాలు, యాంత్రీకరణ, సరికొత్త పరిశోధనలు, మెరుగైన మార్కెటింగ్ వంటి వసతులతో పసుపు రైతులకు ప్రయోజనం కలిగేలా కేంద్రం పూర్తిస్థాయిలో బోర్డు ద్వారా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు తెలంగాణ రైతాంగానికి కావాల్సిన సహాయ సహకారాలను కేంద్రం అందిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమమే పరమావధిగా పాలన సాగిస్తోందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు నెలకొని ఉన్నప్పటికీ రైతాంగ ప్రయోజనాల కోసం ఏడాది కాలంలోనే తమ ప్రభుత్వం రూ. లక్ష కోట్ల వరకు వెచ్చించిందని వెల్లడించారు. అంతకుముందు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. పసుపు బోర్డును ఏర్పాటు చేస్తూ, నిజామాబాద్ లో నెలకొల్పిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి పసుపు రైతుల పక్షాన ధన్యవాదాలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.

