. . . ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాం
. . . భారత్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చబోతుంది
. . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ :
గడిచిన రెండున్నరేళ్ల ప్రజా పాలనలో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశామని, భవిష్యత్తు తెలంగాణ నిర్మాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రజా ప్రభుత్వం సాధించిన ప్రతి విజయానికి ప్రజలు, ఉద్యోగులు, అధికారులు అందించిన సహకారం కీలకమని పేర్కొంటూ, భగవంతుడి ఆశీస్సులు, ప్రజల సహకారంతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సీఎం పిలుపునిచ్చారు. గడిచిన 32 నెలల్లో ప్రజా ప్రభుత్వం సంక్షేమంతో నాలుగు కోట్ల మంది ప్రజలకు భరోసా కల్పించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు సామాజిక న్యాయంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించామని చెప్పారు. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతికత, నైపుణ్యాలపై బలమైన పునాదులు వేశామని, ఈ విజయాల పునాదిపైనే తెలంగాణను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బృహత్తర సంకల్పంతో తెలంగాణ రైజింగ్-2047 కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. తాజా ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపు 91 శాతం అధికంగా ఉందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలాన్ని ఇది చాటిచెబుతోందని అన్నారు. సంక్షేమాన్ని కేవలం ఖర్చు చేసిన రూపాయలతో లెక్కించకుండా, పేదల పట్ల మానవీయత, బాధ్యత, వారి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఆత్మగౌరవం కల్పించాలన్న లక్ష్యంతో పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే నమ్మకంతో రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల కష్టాలను తీర్చి వ్యవసాయాన్ని పండగ చేయాలన్న లక్ష్యంతో చర్యలు తీసుకున్నామని, వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో తెలంగాణ పంజాబ్‌ను అధిగమించి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా సాధించే విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. తుమ్మడిహెట్టి నుంచి పాలమూరు వరకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యక్రమంలో పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. సంక్షేమ పథకాల్లో సన్నబియ్యం పథకం విప్లవాత్మకమైనదని, పేదలకు ఆరోగ్యకరమైన ఆహారం, ఆత్మగౌరవంతో కూడిన జీవనాన్ని అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనమని అన్నారు. 93 లక్షలకు పైగా కుటుంబాలు, దాదాపు 3.38 కోట్ల మంది ప్రజలను ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు భరోసా కల్పిస్తూ 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని, రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తున్నామని తెలిపారు. కొత్త సాంకేతికతతో రేషన్ పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతున్నామని చెప్పారు. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని, తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు సహా 43 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నామని వెల్లడించారు. పన్నెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణను ప్రజా ప్రభుత్వం ఆమోదించిందని, దీని ద్వారా సుమారు కోటి 11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కలిగిందని తెలిపారు. గిగ్ కార్మికుల సంక్షేమం కోసం దేశంలోనే ఆదర్శవంతమైన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చామని చెప్పారు.

విద్యారంగంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు స్పష్టమైన ఫలితాలను ఇస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరుకుందని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడాన్ని ప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతగా తీసుకుందని, ఇప్పటివరకు ప్రభుత్వ శాఖల్లో 72 వేలకు పైగా ఉద్యోగ నియామకాలను పూర్తి చేశామని వెల్లడించారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, మెగా డీఎస్సీ నియామకాలను విజయవంతంగా నిర్వహించామని, నోటిఫికేషన్ ఇచ్చి ఆగిపోకుండా పరీక్షలు, ఫలితాలు, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించామని చెప్పారు. టీజీపీఎస్సీ ద్వారా 456 వివిధ పోస్టులు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపట్టామని సీఎం వివరించారు. గోషామహల్లో 2,000 పడకల నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టామని, వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్లో మూడు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. తొమ్మిది కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించామని, మరో ఎనిమిది మెడికల్ కాలేజీలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. కొత్తగా 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారా మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. డ్రగ్స్, ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు కొత్తగా టీజీ సేఫ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, ఆహార కల్తీ నియంత్రణ, డ్రగ్స్ నియంత్రణను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నామని చెప్పారు. ప్రత్యేక లీగల్, ల్యాబొరేటరీ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల సమన్వయంతో విస్తృత తనిఖీలు నిర్వహించి కల్తీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ప్రజా ప్రభుత్వ విజయాల్లో ఉద్యోగులు, అధికారులు కీలక భాగస్వాములని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం నుంచి సంక్షేమ పథకాలను చివరి లబ్ధిదారుడికి చేర్చడం వరకు, పెట్టుబడులను ఆకర్షించడం నుంచి అన్ని రంగాల్లో ప్రభుత్వ సేవలను విస్తరించడం వరకు ఉద్యోగులు, అధికారుల సహకారం ఎంతో కీలకమని తెలిపారు. ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు ఆగస్టు 17 నుంచి రాష్ట్రంలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, త్వరలో ప్రజావాణి ఆన్లైన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించి ఎక్కడి నుంచైనా అర్జీలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. తెలంగాణ పోటీ ఇతర రాష్ట్రాలతో కాదని, ప్రపంచంతోనే అని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కార్యాచరణ ప్రారంభించామని, ప్రజా పాలనలో జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు తెలంగాణపై నమ్మకం పెరిగిందని చెప్పారు. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్‌లో బిజినెస్ ఎంట్రీ, కన్స్ట్రక్షన్ పర్మిట్ ఎనేబ్లర్స్, సర్వీస్ సెక్టార్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో తెలంగాణ టాప్ అచీవర్‌గా నిలవడం ఇందుకు నిదర్శనమన్నారు. ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటిచెబుతామని తెలిపారు. ఐటీ రంగంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని సీఎం వెల్లడించారు. 2025-26లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.3.97 లక్షల కోట్లకు చేరాయని, ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు 12.14 లక్షలకు పెరిగాయని చెప్పారు. హైదరాబాద్‌లో 355కు పైగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు పనిచేస్తున్నాయని, 2026లో కొత్తగా 40 గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు హైదరాబాద్‌కు వచ్చాయని తెలిపారు. డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో తెలంగాణ దేశంలో వేగంగా ఎదుగుతున్న గమ్యస్థానాల్లో ఒకటిగా మారిందన్నారు. అమెజాన్ తెలంగాణలో అదనంగా 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రకటించిందని, భారత్ ఫ్యూచర్ సిటీ, చందన్వెల్లి ప్రాంతాల్లో దేశంలోని అతిపెద్ద హైపర్‌స్కేల్, ఏఐ-రెడీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్‌లలో ఒకటి రూపుదిద్దుకుంటోందని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులు హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ కోసం భూములిచ్చిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు ఈ విషయంలో పెద్దమనసుతో అర్థం చేసుకోవాలని కోరుతూ, ఎవరికీ ఎలాంటి నష్టం, కష్టం రానివ్వబోమని స్పష్టం చేశారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని సాధించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. భగవంతుడి ఆశీస్సులతో పాటు ప్రజల సహకారం తోడైతే మరిన్ని విజయాలు సాధించి తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

