. . . మార్కెట్ యార్డులో కమిషన్ ఏజంట్ల హవా
. . . రైతుల పసుపు చోరి వెనుక ఉండేది వారే . . . కొనుగోలు చేసేది వారే
. . . చోరి జరిగిన వ్యాపారులపై చర్యలకు పాలకవర్గానికి వణుకు
. . . చోరి సొత్తును కొనుగోలు చేసిన వారిపై చర్యలకు వెనుకడుగు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు రైతులకు రక్షణ లేకుండాపోయింది. దేశంలోనే పేరెన్నిక కలిగిన ఈనామ్ వ్యవస్థ కలిగిన పసుపు మార్కెట్ యార్డులో దొంగలు పడుతున్నారు. ప్రధానంగా రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లైసెన్స్ లు కలిగిన ట్రేడర్లు, కమిషన్ ఏజంట్లు వారి సరుకులను చోరి చేస్తున్నారు. మార్కెట్ యార్డులో ముందస్తు ఒప్పందం ప్రకారం ఆడ్తి దుకాణాల ద్వారా విత్తనాలు, ఎరువులు, రుణాలు తీసుకున్న రైతులు వారికే పసుపు విక్రయించాలనే అంతర్గత ఒప్పందం ఉంటుంది. దానిని ఆసరాగా చేసుకుని రైతులు తాము పండించిన సరుకులను ధర్మకాంట (వే బ్రిడ్జి)లలో తూకం వేయకుండానే వ్యాపారులను, కమిషన్ ఏజంట్లను నమ్మి సరుకులను మార్కెట్ యార్డుకు తరలిస్తున్నారు రైతులు. అక్కడే రైతుల అవసరాలను, సమయాన్ని పరిగణలోకి తీసుకుని తమకు కేటాయించిన స్థలంలో సరుకులను ఉంచి మద్దతు ధర వస్తుందని నమ్మించి సరుకులను చోరి చేసే పరిస్థితి యార్డులో నెలకొంది. ప్రతి దుకాణాదారుడికి అనుబంధంగా ఉండే హమాలీ, చాటా కార్మికుల ద్వారా తొలుత చాటలలో లేదా ఏకంగా ముల్లెలలోనే అదీ కుదిరితే సింగిడిలను (సంచులను) మాయం చేస్తున్నారు. ఇటీవల నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగింది ఇదే వ్యవహరం.

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల కష్టాన్ని వారు సొమ్ము చేసుకోకముందే వ్యాపారులు, కమిషన్ ఏజంట్ల దోపిడికి గురవుతున్నారు. కర్షకులకు మద్దతు ధర దొరుకుతుందని ఆన్ లైన్ ద్వారా మంచి రేటు లభిస్తుందని నమ్మించి రోజుల తరబడి యార్డులో వేలం కోసం ఎదురు చూసేలా చేయడం వ్యాపారులు, కమిషన్ ఏజంట్ల వంతుగా మారింది. అదే సమయంలో రైతులు ఏమరుపాటుగా ఉన్నప్పుడు చాటలలో, సింగిడిలలో, ముల్లెలలో సరుకులను చోరి చేస్తున్నారు. ఇందులో తమ ప్రమేయం ఏమి లేదని కార్మికులు చేస్తున్నారని వారిపై తోసేసి తప్పించుకునే కల్చర్ గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. లైసెన్స్ కలిగిన ట్రేడర్లు, కమిషన్ ఏజంట్లు అధికారిక గుర్తింపు కోసం ప్రభుత్వానికి ప్రతి యేడాది కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. అదీ కాదని ఇటీవల కాలంలో పాలకవర్గాలు కప్పాన్ని కట్టించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దాదాపు ప్రతీ సీజన్ లో వ్యాపారులు, కమిషన్ ఏజంట్ల నుంచి కోటి నుంచి కోటి 50 లక్షలు ఆదనంగా వసూల్ చేస్తున్నారు. పాలకవర్గం మీకు సహకరిస్తుందని మీరు చెప్పిందే ధర అంటూ లోపాయికారి ఒప్పందంతో దుకాణంకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు వసూల్ చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు వాటా అంటూ వసూళ్ళ కార్యక్రమం జరుగుతుంది. దానిని ఆసరాగా తీసుకుని కమిషన్ ఏజంట్లు, వ్యాపారులు తాము నిర్ణయించిన ధరకే సరుకులను కొనుగోలు చేయడం లేకపోతే గోదాములు ఖాళీగా లేవని, ఎగుమతులు జరుగడం లేదని సాకులు చెప్పి ధరను తగ్గించే పరిస్థితి నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఉంది.

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో చోరి జరిగిన సరుకులను గేటు బయట కొనుగోలు చేసే యంత్రాంగం ఉంది. సాధారణంగా దొంగ సొత్తును కొనుగోలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు, రికవరి సాధారణం. కానీ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని పసుపును కార్మికులు కానీ, ఇతరులు కానీ చోరి చేసిన వాటిని గేటు ప్రధాన ద్వారం ముందు గల ఐడీసీఎంఎస్ కార్యాలయం ఎదుట ఉన్న షాప్ లో అమ్ముతారనేది అందరికీ తెలిసిన విషయమే. గంజ్ మధ్య గేటులో ఉన్న మరో వ్యాపారికి చోరి సరుకులను అమ్మడం నిత్యం జరిగే తంతు. అక్కడ కార్మికుల వద్ద అగ్గువా సగ్గువాకు కొనుగోలు చేసే చోరి సొత్తును కొనుగోలు చేసే వ్యాపారులు రైతుల పేరున మళ్ళీ యార్డులోనే వేలంలో పాల్గొంటున్నారు. చోరి సొత్తుకు అధికారిక గుర్తింపు ఇచ్చేది ట్రేడర్లు, కమిషన్ ఏజంట్లతో పాటు పాలకవర్గం కూడా ఉండడం విశేషం. చోరి సొత్తు రికవరి అయ్యేది రెండే దుకాణాల వద్ద అనేది వ్యాపారులకు, కమిషన్ ఏజంట్లకు, అధికారులకు తెలిసినా యార్డు బయట అనే సాకుతో ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ఈ విషయంలో రైతులు నష్టపోతున్నా వ్యాపారులకు గానీ, పాలకవర్గాలకు గానీ పట్టింపు లేదు. కష్టపడి పండించిన పంటను యార్డులో దొంగతనానికి గురవుతున్నా దానికి అధికారిక గుర్తింపు కల్పించి అమ్మకాలు జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడం వెనుక అందరూ మిలాఖత్ అనే విషయం మార్కెట్ యార్డులో కోడై కూస్తోంది. మొత్తానికి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు నష్టపోతున్న పాలకవర్గం కానీ, ట్రేడర్లు కానీ సీరియస్ గా తీసుకోకుండా చోరి సొత్తును కొనుగోలు చేస్తున్న వారి వెనుక ఉండడం మర్మం కప్పం వసూల్ చేయడమేనని మార్కెట్ యార్డులో ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారు.