28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జిల్లాలో అనుమతిలేని క్యాంపస్‌లను వెంటనే మూసివేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అర్హత లేని సిబ్బందితో నిర్వహించిన పరీక్ష విధులపై చర్యలు తీసుకోవాలి

 

. . . విద్యార్థులకు సరైన ధృవపత్రాలు జారీ చేయాలి

 

. . . ఆర్ వై ఎఫ్ జిల్లా సెక్రటరీ పిట్ల నరేష్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లాలోని ఇంటర్మిడియట్ బ్రాంచ్‌లపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి అనుమతి లేని క్యాంపస్‌లను వెంటనే మూసివేయాలని ఆర్ వై ఎఫ్ జిల్లా సెక్రటరీ పిట్ల నరేష్ అన్నారు. జిల్లాలోని పలు ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో జరుగుతున్న తీవ్రమైన అక్రమాలపై రెవల్యూషనరీ యూత్ ఫ్రంట్ జిల్లా కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రారంభమైన ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా ఆర్యనగర్‌లో ఉన్న ఎస్ ఆర్ జూనియర్ కాలేజ్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ పరిధిలో పరీక్షా కేంద్రంగా పనిచేస్తోందని, కానీ ఇక్కడ పరీక్షల ఇన్విజిలేషన్ డ్యూటీలను గత మూడు సంవత్సరాలుగా అర్హతలేని వ్యక్తులతో నిర్వహిస్తున్నారన్నారు. కనీసం పీజీ అర్హత లేకుండా, కొందరు డిగ్రీ కూడా లేకుండా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం సరిపడా లెక్చరర్లను నియమించకపోవడమే అని తెలిపారు. దాస్‌నగర్‌లో ఉన్న ఏవీఆర్ గర్ల్స్ క్యాంపస్ కు ఎలాంటి అధికారిక అనుమతి లేకపోయినా, అక్కడ ఎగ్జామినేషన్ స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారని, ఈ కారణంగా ప్రధాన బ్రాంచ్‌లో లెక్చరర్ కొరత ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సరైన విద్యార్హత లేని వ్యక్తులకు పక్కన సబ్జెక్టులు అటాచ్ చేసి వారి పేర్లను సబ్జెక్టు లెక్చరర్స్ అని బోర్డ్ కు పంపిస్తున్నారని, పరీక్షా డ్యూటీ రెమ్యునరేషన్ డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతున్నాయని అన్నారు. బుధవారం జరిగిన ఎన్విరాన్ మెంటల్ ఎతిక్స్ పరీక్షలో పేపర్లు వార్డెన్స్ చేత కరెక్షన్ చేయించగా, వారికి కనీస పీజీ అర్హత కూడా లేదని, వారు పేపర్లపై తమ పేర్లు రాసి సంతకాలు చేశారని పేర్కొన్నారు. ఈ ఎగ్జామ్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్ రికార్డ్స్ కాలేజ్ స్టోర్ రూమ్ లో దిద్దకుండానే పెట్టారని, కానీ మార్క్ షీట్ లో మాత్రం మార్క్స్ వేశారని, దాన్ని సిస్టంలో అప్లోడ్ చేశారని తెలిపారు. ఈ పరిస్థితి కేవలం ఆర్యనగర్ బ్రాంచ్‌కే పరిమితం కాకుండా ఎస్ ఆర్ కాలేజ్ మెయిన్ బ్రాంచ్ (గంగస్థాన్ బ్రాంచ్), ఎస్ఆర్ కాలేజ్ ఎంఎస్ఆర్ క్యాంపస్, ఎస్ఆర్ విశ్వ భారతి క్యాంపస్ లలో కూడా కొనసాగుతుందని అన్నారు. ప్రాక్టికల్ పరీక్షల్లో ఒక బ్రాంచ్ కోడ్ నుంచి ఫార్వర్డ్ చేసిన లెక్చరర్ స్థానంలో వేరే బ్రాంచ్ కోడ్ నుంచి లెక్చరర్లను డ్యూటీ చేయించారని, ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అదేవిధంగా ఎస్ ఆర్ కాలేజ్, ఎవీఆర్ గర్ల్స్ క్యాంపస్ అనుమతి లేకుండా నడుస్తోందని, అక్కడ ఫీజు రసీదులు ఎస్ఆర్ కాలేజ్ ఏవీఆర్ క్యాంపస్ పేరుతో ఇస్తున్నారని, గత మూడు సంవత్సరాలుగా ఈ బ్రాంచ్ నడుస్తూ, ఒక్కో విద్యార్థి నుంచి ₹1,20,000 నుంచి ₹1,30,000 వరకు ఫీజులు వసూలు చేశారని పేర్కొన్నారు. అక్కడ వసూలు చేస్తున్న మొత్తం నల్లధనంగా మారుతుందని, ఈ మొత్తం అశోక్ రెడ్డి ద్వారా వరంగల్ చేరుతుందని, ప్రభుత్వం వెంటనే ఈ మొత్తాన్ని రికవర్ చేయాలని తెలిపారు. గతంలో సెకండియర్ పూర్తి చేసిన విద్యార్థుల టీసీలు, బోనాఫైడ్లు, ఇంటర్మీడియట్ మెమోలు అర్హత లేని ప్రిన్సిపల్స్ సంతకాలతో జారీ చేయబడ్డాయని, ఎస్ ఆర్, ఏవీఆర్ గర్ల్స్ క్యాంపస్ బ్రాంచ్ కే పర్మిషన్ లేనప్పుడు అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపల్ కి ఏ విధంగా అర్హత ఉంటుందని, విద్యార్థులు ఒక క్యాంపస్‌లో చదివి, వేరే బ్రాంచ్ ద్వారా ఫార్వర్డ్ చేయబడ్డారని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగాల కోసం సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఈ వ్యత్యాసం బయటపడితే విద్యార్థుల సర్టిఫికెట్లు చెల్లకపోయే ప్రమాదం ఉందని, వెంటనే అర్హత కలిగిన ప్రిన్సిపల్ సంతకంతో సరైన ధృవపత్రాలు జారీ చేయించాలని ఆయన కోరారు. అదేవిధంగా వరంగల్‌లో అనుమతి పొందిన ఎస్ ఆర్ యునివర్సీటీ పై కూడా సమగ్ర విచారణ జరిపి అక్రమాలు ఉన్నట్లయితే పర్మిషన్ రద్దు చేయాలని, ఒక చిన్న ఇంటర్మీడియట్ కాలేజీలోనే ఇన్ని అవకతవకలు జరుగుతున్నప్పుడు, విశ్వవిద్యాలయం స్థాయిలో పరిస్థితి ఎలా ఉంటుందనే సందేహం తలెత్తుతోందని అన్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆర్ వై ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

More articles

Latest article