25.4 C
Hyderabad

రెండు బస్సులు ఢీ . .  .  తప్పిన పెను ప్రమాదం

Two buses collide... major accident averted.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విద్యార్థులకు స్వల్ప గాయాలు

. . .  కొత్త బస్టాండ్ చౌరస్తాలో ఘటన

సిరిసిల్ల, బతుకమ్మ  :

సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో శనివారం ఉదయం రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో విజ్ఞాన్ కాన్సెప్ట్ స్కూల్‌కు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న విజ్ఞాన్ కాన్సెప్ట్ స్కూల్ బస్సును పెద్దూరు వైపు నుంచి వస్తున్న అపెరల్ పార్క్‌కు చెందిన బస్సు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఉన్న చౌరస్తాలో వెనుక వైపు నుంచి ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. బస్సు ఢీకొనడంతో స్కూల్ బస్సు అద్దాలు పగిలిపోయాయి. విద్యార్థులకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే వారికి చికిత్స అందించినట్లు సమాచారం. అదృష్టవశాత్తు ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వేగ నియంత్రణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి కొత్త బస్టాండ్‌కు సమీపంలోనే ప్రధాన చౌరస్తా ఉండటంతో నిత్యం వాహనాల రద్దీ, ప్రజల రాకపోకలు అధికంగా ఉంటాయని స్థానిక షాపు యజమానులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, గతంలో ప్రాణనష్టం జరిగిన ఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇసుక ట్రాక్టర్లు, ఆర్టీసీ బస్సులు తదితర వాహనాలు అధిక వేగంతో చౌరస్తా మీదుగా వెళ్తుండటంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, ప్రజల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతం కావడంతో ఆర్‌అండ్‌బీ, రవాణా శాఖకు సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరగకుండా వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article