మద్నూర్, బతుకమ్మ:
సిర్పూర్ గ్రామస్థులపై దాడి చేసిన ఇసుక మాఫియాకు చెందిన ఇద్దరు మహారాష్ట్ర వాసులను అరెస్టు చేసినట్లు బిచ్కుంద సీఐ రవి కుమార్ తెలిపారు. శనివారం బిచ్కుంద సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ…..ఈనెల 10న రాత్రి సమయంలో కామారెడ్డి జిల్లా మద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్పూర్ గ్రామ శివారులో, మహారాష్ట్ర రాష్ట్ర నాందేడ్ జిల్లా దేగ్లూర్ తాలూకా తములూరు గ్రామానికి చెందిన పీరాజీ, జునేద్ వారి అనుచరులు అక్రమ ఇసుక రవాణా చేస్తుండగా, వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన సిర్పూర్ గ్రామస్థులైన షేక్ ఫరూక్, అయాన్, ఖదీర్, అఫ్రోజ్, అయూబ్‌లపై దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై బాధితులు షేక్ ఫరూక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, బాన్సువాడ డీఎస్పీ పర్యవేక్షణలో, మద్నూర్ సీఐ రవి కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం నిందితుల అన్వేషణ చేపట్టి, శనివారం కేసులో ప్రధాన నిందితులు పీరాజీ, జునేద్‌లను అరెస్ట్ చేసి, కోర్టు రిమాండ్‌కు తరలించడం జరిగింది. నిందితుల వద్ద నుంచి ఒక ఫ్యాషన్ ప్రో మోటార్ సైకిల్, రెండు సెల్ ఫోన్లు నేరానికి ఉపయోగించే రెండు ఐరన్ రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. బిచ్కుంద సీఐ మాట్లాడుతూ..ఎక్కడైనా అక్రమ ఇసుక రవాణా లేదా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు గమనించినప్పుడు వెంటనె డయల్ 100 కు లేదా సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వవలసిందిగా ప్రజలను కోరారు.
