- అమిత్ షా సభను విజయవంతం చేయండి
- తెలంగాణ పసుపు రైతుల సంఘం పిలుపు
ఆర్మూర్, బతుకమ్మ : పసుపు రైతులు అమిత్ షా బహిరంగ సభను విజయవంతం చేసి సంబరాలు చేసుకోవాలని కోటపాటి నరసింహనాయుడు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో శుక్రవారం పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి నరసింహంనాయుడు మరియు బిజెపి కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పాటూరి తిరుపతిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా తెలంగాణ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యమించి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కృషితో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించుకున్న పసుపు బోర్డు కల నెరవేరిన వేళ, నిజామాబాద్ కేంద్రంగా కార్యాలయాన్ని కేంద్ర హోమ్ శాఖ మాత్యులు అమిత్ షా విచ్చేసి ప్రారంభిస్తున్న చారిత్రాత్మక రోజున పసుపు రైతులు సంబరాలు జరుపుకోవాల్సిన తరుణం కాబట్టి ఆదివారం 29వ తేదీన నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగే పసుపు రైతుల సమ్మేళనం గొప్పగా జరుపుకోవాలని, ఆర్మూర్ సబ్ డివిజన్లోని 250 పసుపు పండించే రైతు సంఘాల సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని, ఇప్పటికే అన్ని రైతు సంఘాలకు ఆహ్వానిస్తూ తెలంగాణ పసుపు రైతుల సంఘం ఉత్తరాలు పంపడం జరిగిందని, పసుపు రైతుల సమ్మేళనం అధికారిక కార్యక్రమం కాబట్టి రైతులందరూ పార్టీలకతీతంగా పాల్గొనాలని కోటపాటి విజ్ఞప్తి చేశారు. విలేఖరుల సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు ఎస్ రుక్మాజి తదితరులు పాల్గొన్నారు.