24.7 C
Hyderabad
Monday, August 3, 2026

నేడే తొలివిడత పంచాయితీ పోరు

Must read

📰 Generate e-Paper Clip

. . . నిజామాబాద్ జిల్లాలో 155 పంచాయితీల్లో ఎన్నికలు
. . . కామారెడ్డిలో 157 జీపీలలో ఎలక్షన్
. . . ఉమ్మడి జిల్లాలో పోలీసుల పటిష్ట బందోబస్తు
. . . పోల్ మేనేజ్ మెంట్ లో పార్టీ నేతల బిజీ
నిజామాబాద్, బతుకమ్మ :
తెలంగాణలో తొలిదశ గ్రామ పంచాయితీ ఎన్నికలు గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు పోలీంగ్, 2 గంటల నుంచి కౌంటింగ్, ఫలితాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో తొలివిడతలో 3836 జీపీలలో ఎన్నికలు జరుగనున్నాయి. 13127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 18 రకాల ఐడి కార్డులను చూపించి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. తొలివిడత జీపీ ఎన్నికల్లో 56 లక్షల 19 వేల 430మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలతో పాటు అన్నీ పోలీంగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేశారు.

Today is the first phase of the Panchayat War
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తొలివిడత పంచాయితీ ఎన్నికలు గురువారం జరుగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పోలీంగ్ జరుగనుంది. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లాలో తొలివిడత బోధన్ డివిజన్ లోని పది మండలాల్లో, నిజామాబాద్ డివిజన్ లోని నవీపేట్ మండలంలోని 155 పంచాయితీలలో సర్పంచ్ లు, వార్డు మెంబర్లకు పోలీంగ్ జరుగనుంది. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి డివిజన్ లో 157 జీపీలలో ఎన్నికలకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది.

 

Today is the first phase of the Panchayat War
. . . నిజామాబాద్ జిల్లాలోని 155 జీపీలలో
నిజామాబాద్ జిల్లాలోని తొలి విడత పంచాయితీ ఎన్నికలు బోధన్ మండలం చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలురా, వర్ని, ఎడపల్లి, నవీపేట్ మండలాల్లోని 184 పంచాయితీలకు ఎన్నికలకు ఇది వరకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే. అందులో 29 పంచాయితీలు ఏకగ్రీవం కావడంతో 155 జీపీలలో గురువారం ఎన్నిక జరుగనుంది. మొదటి విడత పంచాయితీ ఎన్నికల కోసం 155 పంచాయితీలలో 1642 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 29 పంచాయితీలతో సర్పంచ్ లతో పాటు 575 వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటి విడత జరిగే పంచాయితీ ఎన్నికల్లో ఏడు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 155 పంచాయితీల్లోని 1060 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 1440 పోలీంగ్ స్టేషన్ లలో అధికారులు ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయితీ ఎన్నికల కోసం స్వయంగా పోలీస్ కమిషనర్ సాయిచైతన్య రంగంలోకి దిగారు. ఇద్దరు అదనపు డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 17 మంది సర్కిల్ ఇన్స్ పెక్టర్లు, 71 మంది ఎస్సైలు, 74 మంది ఏఎస్సైలు, 192 మంది హెడ్ కానిస్టేబుళ్ళు, 789 మంది మహిళ, పురుష కానిస్టేబుళ్ళు, 233 మంది హోంగార్డులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీంగ్ జరిగే కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో 163 బీఎన్ఎస్ యాక్టును అమలు చేస్తున్నారు.

Today is the first phase of the Panchayat War
. . . కామారెడ్డి జిల్లాలో
కామారెడ్డి జిల్లాలో తొలివిడత పంచాయితీ ఎన్నికలు కామారెడ్డి డివిజన్ లో జరుగనున్నాయి. మొత్తం 167 పంచాయితీలకు నోటిఫికేషన్ విడుదల కాగా పది మంది సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 76 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాంతో 157 జీపీలలో గురువారం ఎలక్షన్ జరుగనుంది. 1457 పోలీంగ్ స్టేషన్ లలో 248668 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కామారెడ్డి జిల్లాలో రెండు అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులు, మూడు అంతర్ జిల్లా చెక్ పోస్టుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటి విడత ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 54 రూట్ మోబైల్స్, 10 స్ట్రైకింగ్ ఫోర్స్, 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ లను ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లాలో 33 పొలిటికల్, 33 సెన్సీటివ్ పోలీంగ్ కేంద్రాలు ఉన్నాయని ఆయా పోలీంగ్ కేంద్రాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

Today is the first phase of the Panchayat War

. . . పోల్ మేనేజ్ మెంట్ లో లీడర్ల బిజీ
ఉమ్మడి జిల్లాలో జీపీ ఎన్నికలను అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బోధన్ డివిజన్ లో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సుదర్శన్ రెడ్డి రంగంలోకి దిగి ప్రచారం చేయడం విశేషం. బాన్సువాడకు చెందిన రెండు ఉమ్మడి మండలాలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రచారం చేయడం విశేషం. కామారెడ్డి డివిజన్ లో స్థానిక ఎమ్మెల్యే వెంకట్ రమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీలు ప్రచారం చేశారు. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలీంగ్, మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్ నేపథ్యంలో జీపీ ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారానికి ఎన్నికల సంఘం బ్రేక్ వేయడంతో హోల్ మేనేజ్ మెంట్ లో పార్టీల నాయకులు బిజీ అయ్యారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో తమ అనుచరులే సర్పంచ్ లుగా ఉంటే బలంగా ఉంటుందని నమ్మిన నేతలు ప్రచారంలో దూకుడు ప్రదర్శించిన విషయం తెల్సిందే. అయితే పంచాయితీ ఎన్నికల్లోనూ మద్యం పంపిణీ జోరుగా సాగుతోంది. ఓటుకు నోటును పంపిణీకి రాత్రికి రాత్రే ఏర్పాట్లు జరిగాయి. జీపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు పార్టీలు తమ అభ్యర్థులకు వెన్నుదన్నుగా ఉంటూనే గెలుపు కోసం అన్నీ శక్తులను ఒడ్డుతున్నాయి.

More articles

Latest article