. రైతులు దళారులకు ధాన్యం విక్రయిస్తున్నారు
. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
. రైతులు మోసపోతే ఎవరు బాధ్యత వహిస్తారు
. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ: ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన రాష్ర్ట ప్రభుత్వం, ఇప్పుడు అదే బోనస్ ను ఎగ్గొట్టేందుకు కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. కలెక్టరేట్ ఆవరణలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ పక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ కొబ్బరి కాయలు కొడుతున్నారని, మరో పక్క రైస్ మిల్ ల అలాట్ మెంట్ లేదని అన్నారు. ప్రభుత్వ చేతగాని తనం కారణంగా రైతులు దళారులకు ధాన్యం విక్రయించే పరిస్థితి వచ్చిందన్నారు. క్వింటాల్ కు రూ.2300 మద్దతు ధరతోపాటు బోనస్ రూ.500 కలుపుకుని క్వింటాల్ ధాన్యానికి రూ.2800 రైతులకు దక్కాల్సి ఉండగా, దళారులకు రైతులు రూ.2100కే విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వద్ద ఏ రోజు ఎంత విస్తీర్ణంలో వరిసాగు చేశాడనే లెక్కలున్నాయని, ఆ లెక్కల ప్రకారం రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో రైతులు దళారులకు ధాన్యం విక్రయించిన దాఖలాలు లేవన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న దళారులు వారిని మోసం చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని వేముల ప్రశ్నించారు. ప్రభుత్వమే బాధ్యత వహించి రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
