29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

హనుమాన్ పెద్ద జయంతికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలి

 

. . . జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

 

జగిత్యాల్, బతుకమ్మ :

 

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భక్తులు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా 950 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కొండగట్టు జేఎన్‌టీయూ కళాశాలలో ఆదివారం నిర్వహించిన బ్రీఫింగ్ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ బందోబస్తును 6 సెక్టార్లుగా విభజించి, 3 షిఫ్టుల విధానంలో పోలీసు సిబ్బందికి విధులు కేటాయించినట్లు వెల్లడించారు. జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే జిల్లా పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు పోలీసు సిబ్బంది ఓపికతో సలహాలు, సూచనలు ఇస్తూ విధులు నిర్వర్తించాలని, ఎక్కడా అసౌకర్యం కలగకుండా అందరూ సమన్వయంతో పనిచేసి జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా దేవస్థానం, మాల విరమణ ప్రాంతాల్లో విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులు క్యూ లైన్లను పాటించేలా చూడాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 24 గంటల పాటు పోలీసు నిఘా కొనసాగించాలని ఆదేశించారు. ప్రతి భక్తుడు ప్రశాంతమైన వాతావరణంలో ఆంజనేయస్వామిని దర్శించుకుని క్షేమంగా తిరిగి వెళ్లేలా ప్రతి పోలీసు బాధ్యతగా విధులు నిర్వహించాలని తెలిపారు.

. . . పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు

ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున భారీ సంఖ్యలో వచ్చే వాహనాలను క్రమపద్ధతిలో పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్, పార్కింగ్ ప్రాంతాల్లో విధుల్లో ఉన్న సిబ్బంది ట్రాఫిక్ జామ్ కాకుండా నియంత్రణ చేపట్టాలని సూచించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరగకుండా స్టాపర్లు, కోన్స్, రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులు కాలినడకన కొండగట్టుకు వచ్చే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రేడియం స్టిక్కర్లను వారి బ్యాగులు, జెండాలకు అంటించడం జరిగిందన్నారు. రోడ్డు ఇరువైపులా నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, వాహనాలను గమనిస్తూ తమ గమ్యస్థానానికి చేరుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.

 

Tight security arrangements for Hanuman Pedda Jayanti

More articles

Latest article