. . . కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదల కానున్న నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని బుధవారం నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కామారెడ్డి తదితర జిల్లాల కలెక్టర్లలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 729 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి వివరాలను ఇప్పటికే టీ.పోల్ లో నమోదు చేయడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల విషయమై వచ్చిన అభ్యంతరాలను నిశితంగా పరిశీలిస్తూ పరిష్కరించడం జరిగిందని, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమిస్తూ, వారికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉందని, షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా నిఘాను ఉంచేందుకు వీలుగా ఎస్.ఎస్.టీ, ఎఫ్.ఎస్.టీ టీంలను నియమిస్తున్నామని అన్నారు. బ్యాలెట్ బాక్సులు, సామాగ్రి, బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ కు అవసరమైన ఏర్పాట్లు, నామినేషన్ స్వీకరణ కేంద్రాలలో తగిన సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, జోనల్ అధికారులను నియమించేలా ఇప్పటికే సిబ్బందిని గుర్తించడం జరిగిందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ ల కోసం అవసరమైన ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చారు. కాగా, ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా ఎన్నికలను సాఫీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
